'ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'

5 Sep, 2019 15:43 IST|Sakshi

మంత్రి గుమ్మనూరు జయరాం

సాక్షి,వెలగపూడి : కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని 3వ బ్లాక్‌లో కర్మాగారాల శాఖ సంచాలకులు బాలకిషోర్‌ ఆధ్వర్యంలో  13 జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలపై మంత్రి సమీక్షించారు. ప్రమాదాలు జరిగే కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టడంలో కర్మాగార యజమానులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు.

రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అనధికార కర్మాగారాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులనుద్దేశించి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో విధులను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా కర్మాగారాల యజమానులు చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు