మహమ్మారి అంతం..అందరి పంతం

31 Mar, 2020 12:13 IST|Sakshi
ఆలూరులోని క్వారంటైన్‌ కేంద్రంలో వసతులను పరిశీలిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం

జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రశాంతం 

ఇళ్లకే పరిమితమైన ప్రజలు

పరిస్థితిని సమీక్షించిన మంత్రులు, ఎమ్మెల్యేలు 

ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు

కర్నూలు(హాస్పిటల్‌): ‘కరోనా’ మహమ్మారిని అంతం చేయడం అందరూ పంతంగా పెట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే వారు బయటకు వస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం.. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలు కోసం బయటకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలీస్, రెవెన్యూ అధికారులు ఈ విధానాన్ని అమలు చేశారు. ఉదయం వేళల్లో కూరగాయల కొనుగోలు కోసం వచ్చిన ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రహదారులపై వాహనదారులు తిరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

కర్నూలులో జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, నగర పాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ స్థానిక పంప్‌హౌస్‌ వద్ద గుడిసెల్లో జీవనం సాగిస్తున్న పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. నిత్యావసరాల కోసం మాత్రమే ప్రజలు బయటకు వచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గ్రామాల సరిహద్దుల్లో ప్రజలు కంపచెట్లను అడ్డుగా వేశారు. శిరివెళ్లలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఏడుగురు ఉండటంతో వారిని అధికారులు ఆళ్లగడ్డలోని క్వారంటైన్‌కు పంపించారు. ఢిల్లీలోని ఇస్తెమాకు వెళ్లి వచ్చారని నంద్యాలకు చెందిన ఆరుగురిని క్వారంటైన్‌కు పంపించారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పట్టణంలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ స్థానికంగా వ్యాపారులతో సమావేశం నిర్వహించి ఇంటికే సరుకులు అందించాలని సూచించారు.  

భౌతిక దూరాన్ని పాటించండి
ఆలూరు: నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సూచించారు. స్థానిక  కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. వసతి వివరాలను క్వారంటైన్‌ కేంద్రం నోడల్‌ అధికారి డాక్టర్‌ గయాజుద్దీన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ‘కరోనా’ మహమ్మారిని తరిమి కొట్టేందుకు లాక్‌డౌన్‌ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజల సహకారంతో రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు.

ఇంట్లో ఉంటేనే సురక్షితం ;ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్‌: బయటకు రాకుండా ప్రజలు ఇంట్లో ఉండడమే సురక్షితమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీ అతిథి గృహంలో నియోజకవర్గస్థాయి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైరస్‌ నిర్మూలనకు స్వీయ నిర్బంధం తప్ప మందు లేదన్నారు. లాక్‌డౌన్‌లో  ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు అందించే ఏర్పాటు ప్రభుత్వం చేస్తోందన్నారు. వచ్చే నెల నాలుగో తేదీన రేషన్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రూ. 1000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారని తెలిపారు. సమీక్షలో డీఎస్పీ నరసింహారెడ్డి, పీఆర్‌ డీఈ రామకృష్ణారెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్‌ డీఈ రమేష్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కేఎల్‌ఎన్‌ రెడ్డి, ఏఈలు సతీష్, ఉమేశ్, మున్సిపల్‌ డీఈ నాగభూషణం రెడ్డి, సీఐలు సుబ్రమణ్యం, సుధాకర్‌ రెడ్డి, కేశవరెడ్డి డాక్టర్‌ చెన్నకేశవులు తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు