కలకలం !

22 Mar, 2015 03:17 IST|Sakshi

 బూర్జ మండలంలోకి చొచ్చుకొచ్చిన గన్‌కల్చర్
 పీఎల్‌దేవి పేట మాజీ సర్పంచ్‌పై నాటుతుపాకీతో కాల్పులు
 
 బూర్జ/ పాలకొండ రూరల్:ప్రశాంతతకు మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల నేరపూరిత చర్యలు, ఘటనలు చోటుచేసుకుంటుండడంతో జనం హడలిపోతున్నారు. కారణాలు ఏవైనా ప్రత్యర్థులను హత మార్చాలనే లక్ష్యంతో ఫ్యాక్షన్ సంప్రదాయానికి పలువురు తెర తీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టెక్కలి నడిబొడ్డున ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో, గొడ్డళ్లతో దాడిచేసి దారుణంగా హతమార్చిన ఘటన మరువకముందే బూర్జ మండలం పీఎల్‌దేవి పేట గ్రామంలో మాజీ సర్పంచ్‌ను టార్గెట్ చేస్తూ నాటు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మన్మథనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అంతా సందడిగా ఉన్న తరుణంలో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో  పీఎల్‌దేవపేట మాజీ సర్పంచ్ గూండ్రు అప్పన్నపై హత్యాయత్నం జరిగింది.
 
 దారికి అడ్డంగా రాళ్లు పేర్చి..
 మాజీ సర్పంచ్ అప్పన్నను హతమార్చేందుకు పీఎల్‌దేవిపేట-కె.కె.రాజపురం గ్రామాల మధ్య రోడ్డుకు అడ్డంగా    
 గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లుపేర్చారు. సంత వ్యాపారంపై ఆధారపడుతున్న అతను ఎప్పటిలాగే శనివారం తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో సీతంపేట మండలం కుసిమి గ్రామంలో జరగనున్న వారపు సంతకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే దారిలో రాళ్లు అడ్డంగా ఉండడంతో వాహనం దిగి వాటిని తొలగించి వెళ్లిపోదామన్న క్రమంలో రహదారికి కుడివైపున లోతు ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో తుటా అతని నడుం కుడి భాగం నుంచి దూసుకుపోవడంతో పెద్ద కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు. అప్పన్న వేసిన కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
  వీరి రాకను గమనించిన అగంతకుడు అక్కడి నుంచి పరారైనట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం బూర్జ పోలీసులకు చేరడంతోఎస్‌ఐ లక్ష్మణరావు, ఆమదాలవలస సీఐ సింహాద్రినాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన అప్పన్నను ప్రత్యేక వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సూపరింటెండెంట్ రవీంద్రకుమార్, వైద్యాధికారి శ్రీనివాసరావు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. బాధితుడు అప్పన్న, అతని బంధువుల నుంచి వాగ్మూలం తీసుకున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంలను రంగంలోకి దించారు.
 
 ఆధిపత్యపోరే కారణమా?
 అప్పన్నపై కాల్పులు జరగడానికి గ్రామంలో ఆధిపత్యపోరే కారణమని తెలిసింది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్టు బాధితుడు అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇదే క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే గతంలో కూడా తనను హతమార్చేందుకు ఏడాది క్రితం ఇదే తరహా ఘటనకు వ్యూహరచన  చేయగా అప్పట్లో తప్పించుకున్నానని బాధితుడు చెబుతున్నాడు. అదే విషయాన్ని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు చెప్పారు.  
 
 గ్రామస్తుల భయాందోళన
 ఉగాది పండుగ కావడంతో గ్రామమంతా సంబర వాతావరణంలో ఉండగా తెల్లవారు జామున తుపాకీ మోతలు, మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం, గ్రామస్తులే వ్యూహకర్తలని వదంతులు రావడంతో పీఎల్‌దేవి పేట గ్రామస్తుల్లో ఉత్కంఠ నెలకొంది. గన్ కల్చర్ తమ ప్రాంతానికి పాకడంపై బూర్జ మండల వాసులు ఆందోళన చెందుతున్నారు.
 

మరిన్ని వార్తలు