మట్టి కొట్టుకుపోతున్నాం!

30 Mar, 2016 01:55 IST|Sakshi
మట్టి కొట్టుకుపోతున్నాం!

గుండిమెడ రైతుల ఆగ్రహం
ఇసుక రీచ్ వద్ద నాలుగు గంటలపాటు ధర్నా
లారీల కారణంగా పంటలు పాడైపోతున్నాయని ఆందోళన
రహదారిపై నీళ్లు చల్లి వాహనాలు తిప్పుకోవాలని పోలీసుల సూచన

 
తాడేపల్లి రూరల్ : ఉచిత ఇసుక సరే... తమ పంట పొలాల సంగతేంటంటూ గుండిమెడ రైతులు గ్రామంలోని ఇసుక రీచ్ వద్ద మంగళవారం నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు క్వారీ నిర్వాహకులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది.  ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ఫ్లైయింగ్ స్వ్కాడ్ పోలీసులు అక్కడకు చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు పోలీసులతో మాట్లాడుతూ ఇసుక రీచ్ నుంచి వచ్చే లారీలు, ట్రాక్టర్ల వల్ల తమ పంట పొలాలకు వెళ్లే రహదార్లు పూర్తిగా పాడైపోయాయని వాపోయారు. నీళ్లు చల్లకపోవడం వల్ల రోడ్లపై నుంచి దుమ్ము లేచి పంట పొలాలపై పడి ఒక్కో రైతు రూ. 30-40 వేలు నష్టపోవాల్సివచ్చిందని తెలిపారు. ఇప్పుడు అడ్డకోకపోతే పండిన పంట దుమ్ము పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలు వచ్చే రహదారి వెంట 300-500 ఎకరాల జొన్న, మొక్కజొన్న పంట పొలాలుఉన్నాయి. మొక్కజొన్న అయితే  కండె లు విరుచుకుంటామని, జొన్న పరిస్థితి అర్థం కావడం లేదని వాపోయారు. పోలీసులు రహదారుల వెంట నీళ్లు చల్లించి వాహనాలు తిప్పుతామంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

దీంతో పోలీసులు గుండిమెడ ఇసుక రీచ్‌లో తవ్వకాలు నిర్వహిస్తున్న పొక్లెయినర్ల యజమానులను పిలిపించి రైతుల పంటలు పాడవకుండా  రహదారిపై నీళ్లు చల్లించాలని సూచించా రు. అయితే క్వారీలో 8 పొక్లెయిన్లు ఉండగా, ఇద్దరు యజమానులు మా త్రమే అక్కడకు వచ్చి రోజుకొకరు నీళ్లు చల్లుతామంటూ రైతులకు తెలియజేశారు. రైతులు మాత్రం మిగిలిన ఆరుగురితో కూడా నీళ్లు చల్లించే బాధ్యత మీరు తీసుకుంటారా? అని అడగడంతో వచ్చిన ఇద్దరు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు కలగజేసుకుని ప్రస్తుతానికి నీళ్లు చల్లిస్తున్నారు కదా, నీళ్లు చల్లించకపోతే అడ్డుకోవాలని సూచించడంతో రైతులు మెత్తబడ్డారు.

>
మరిన్ని వార్తలు