అనారోగ్యంతోనే పరిశ్రమకు దూరమయ్యా..

2 Apr, 2017 16:07 IST|Sakshi
అనారోగ్యంతోనే పరిశ్రమకు దూరమయ్యా..
► 200 సినిమాల్లో నటించా..
► సీరియల్స్‌కే ప్రాధాన్యమిస్తున్నా..
► సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు
 
అనారోగ్యంతోనే నాలుగేళ్లుగా సినీ పరిశ్రమకు దూరమయ్యానని ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు అన్నారు. కనిగిరిలోని ప్రగతి విద్యానిలయంలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన గుండు హనుమంతరావు, సినీ నటుడు ఆలేటి అరుణ్‌  విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..
   
200 సినిమాల్లో నటించా..: గుండు హనుమంతరావు
‘నాకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి, ’ఇదేమిటీ’ అనే నాటకంలో జంధ్యాల గారు నా నటన చూసి, ‘అహ నా పెళ్లంటా’ సినిమాలో అవకాశం ఇచ్చారు. సినీ పరిశ్రమ తల్లి లాంటిది. అనేక అవకాశాలు కల్పించింది. ఇప్పటి వరకు 200 సినిమాల్లో నటించా. మూడు నంది అవార్డులు వచ్చాయి. అమృతం, బ్రయోషియా, శ్రీమతి సుబ్రహ్మణ్యం సీరియల్స్‌లో ఉత్తమ నటునిగా నంది అవార్డులు వచ్చాయి. పేరు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.
 
ముఖ్యంగా అహనా పెళ్లంటా, రాజేంద్రుడు–గజేంద్రుడు, అమ్మదొంగ, మాయలోడు, యమలీల, అన్నమయ్య, నువ్వులేక నేనులేను, పెళ్లానికి ప్రేమలేఖ..ప్రియురాలికి శుభలేఖ, అన్నమయ్య సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. వ్యసనాలకు బానిసైన వాళ్లే పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా సీరియల్స్, స్టేజ్‌ షోలు చేస్తున్నాను. అమెరికా, దుబాయ్, కువైట్, సిడ్ని, ఖాతర్‌ తదితర చోట్ల స్టేజ్‌ ప్రదర్శనలు చేశా. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. నాకు ఒక కుమారుడు. ఎమ్మెస్సీ చేశాడు, హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తున్నాడు. 
 
ఇష్టమైన కమెడియన్‌ సునీల్‌...
నాకు ఇష్టమైన హీరో కమల్‌హాసన్, హాస్యనటుల్లో పాతతరంలో సూర్యకాంతం, ఇప్పటి వారిలో సునీల్, వెన్నెల కిషోర్‌ హాస్యం బాగుంటుంది. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా ఉన్న సినిమాలో, రెండు సీరియళ్లలో నటిస్తున్నా.

చదువుతూనే నటిస్తున్నా..: సినీ నటుడు వరుణ్‌
లజ్జ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాను. ఆ తర్వాత బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌ సినిమాలో కీరోల్‌గా నటించా. ఈ రెండు సినిమాలు కనిగిరి ప్రాంతంలో కూడా షూటింగ్‌లో జరిగాయి. ఆర్‌పీ పట్నాయక్‌తో ‘మనలో ఒకడు’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాను. ఈనాడు  చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నా. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండటంతో బీటెక్‌ చదువుతూనే సినిమాలో నటిస్తున్నా..అందుకు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. ’ మెగా’ ఫ్యామిలీతో బంధుత్వమే సినిమాల్లో అవకాశానికి ఓ కారణం. తొలుత నువ్వే కావాలి షార్ట్‌ ఫిలింలో నటించడంతో మంచి పేరు వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ నా అభిమాన హీరో. ఎప్పటికైనా ఆయనతో నటించాలన్నదే నా లక్ష్యం. 
మరిన్ని వార్తలు