గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి

5 Apr, 2018 09:23 IST|Sakshi
స్టేషన్‌ భవన నమూనా

రూ.25 కోట్లతో స్టేషన్‌ ఆధునికీకరణ

గుంతకల్లు: గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి హోదానిస్తూ రూ.25 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక ఈ స్టేషన్‌కు మహర్దశేనని రైల్వేవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం ఆరు రైల్వేస్టేషన్లకు, రాయలసీమలో గుంతకల్లు, కర్నూలు స్టేషన్లకు అంతర్జాతీయ హోదా ఇచ్చారు. ప్రస్తుతం గుంతకల్లు స్టేషన్‌లో రూ.6 కోట్లతో మోడల్‌ స్టేషన్‌ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు.

ఈ పనుల్లో మార్పులు చేర్పులు చేసి అంతర్జాతీయ స్థాయిలో భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. రైల్వే అధికారులు పంపిన నమూనాలు పరిశీలిస్తే అవి విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. మోడల్‌ స్టేషన్‌ బిల్డింగ్‌ దక్షిణం వైపున నిర్మిస్తున్నారు. స్టేషన్‌ ప్రాంగణంలో దాదాపు 2 ఎకరాలపైగా స్థలం ఉంది. అందులో పార్కులు, పౌంటెయిన్లు, ఇతరత్రా అందమైన కళాకృతులు ఏర్పాటు చేయాలన్న యోచనతో ఊహాత్మక నమూనాలను బోర్డు అనుమతికి పంపారు. అదేవిధంగా స్టేషన్‌లో ఎస్కలేటర్లు, వైఫై సదుపాయం, ఆధునిక ఎలక్ట్రికల్‌ డిస్‌ప్లే తదితర హంగులతో గుంతకల్లు రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారనున్నాయి.

మరిన్ని వార్తలు