రైలురోకో కేసులో కె.రామకృష్ణకు ఊరట

29 Aug, 2019 07:30 IST|Sakshi

సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : రైలురోకో కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు జరిమానా విధించి, కేసు కొట్టేశారు. ఈ మేరకు గుంతకల్లు రైల్వేకోర్టు స్పెషల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ టి.వెంకటేశ్వర్లు సంచలన తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి 2008 జూలై 7న అనంతపురం రైల్వేస్టేషన్‌లో రైలురోకో చేశారు.

ఈ ఘటనపై ఆర్‌పీఎఫ్‌ పోలీసులు రైల్వే యాక్టు ప్రకారం అప్పట్లోనే కేసు నమోదు చేశారు. రైలును అడ్డుకున్నందుకు 174/ఏ కింద, ఆర్‌పీఎఫ్‌ పోలీసుస్టేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు 147 కింద కేసులు నమోదు చేశారు. బుధవారం కోర్టుకు హాజరైన సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణకు రైల్వే కోర్టు జడ్జి వెంకటేశ్వర్లు రూ.700 ఫైన్‌ విధించి కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారని న్యాయవాదులు చెన్నకేశవులు, యూనస్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు