సోలార్ హబ్‌గా గుంటూరు

17 Jul, 2014 23:56 IST|Sakshi
సోలార్ హబ్‌గా గుంటూరు

అరండల్‌పేట (గుంటూరు):  రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కొరత రోజు రోజుకు తీవ్రమవుతోంది. అవసరాలకు సరిపడ ఉత్పత్తి చేయలేక పోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. చాలినంత విద్యుత్ లభించక, పరిశ్రమలు నడపలేక పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు గృహ వినియోగదారులు, వ్యవసాయానికి విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించిన ప్రభు త్వానికి సౌర విద్యుత్ ఉత్పత్తి సులువైన మార్గంగా కనిపించింది. ఇదే సమయంలో నిరంతర విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం మరింత కలిసొచ్చే అంశంగా మారింది. ఇక సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనువైన ప్రాంతంగా గుంటూరు జిల్లాను ఎంపికచేయడం విశేషం.

వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి ..
  జిల్లాలో వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే బిడ్లు పిలిచేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.
తొలుత నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 300 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్ ఏర్పాటుకు స్థలం సేకరించారు.
గురజాల..రెంటచింతల మధ్య గొట్టిముక్కల గ్రామం వద్ద 2వేల ఎకరాల సర్కారు భూమిని గుర్తించిన ఏపీఐఐసీ ప్రభుత్వానికి నివేదించింది.
మిగిలిన 700 మెగావాట్ల సామర్థం కలిగిన యూనిట్ల ఏర్పాటుకు బిడ్లు పిలవాల్సి ఉంటుంది.
సౌరవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో చిన్నచిన్న యూనిట్లు ఏర్పాటు చేశారు.
కొద్దిరోజుల కిందట నగరానికి చెందిన పారిశ్రామికవేత్త అరుణాచలం మాణిక్యవేల్ తాడికొండ మండలం పరిధిలో ఒక ప్లాంట్‌ను ప్రారంభించారు.

ముందుకురాని ఔత్సాహికులు ...
వాస్తవానికి సౌరవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు వెసులుబాటులు కల్పించింది.
ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేసిన వారికి ఢిల్లీలోని నేషనల్ సోలార్ మిషన్ ద్వారా రూ.12 వేలు అందించాల్సి ఉంది.
అలాగే ఢిల్లీలోని ఎనర్జీ ఎక్ఛ్సేంజ్ బాండ్లు(ఆర్‌ఈసీ) జారీ చేస్తోంది. ఈ బాండ్లు పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేసుకుంటే వారికి సాధారణ కోతల సమయంలో సైతం విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది.
రెండేళ్లుగా ఆర్థిక ప్రోత్సాహం అందడం లేదు. అలాగే పారిశ్రామిక వేత్తలకు సైతం ఈ బాండ్లపై అవగాహన కల్పించలేదు.
 
 సౌరవిద్యుత్ ఉత్పత్తికి  కేంద్రం ప్రోత్సాహం  
కేంద్ర ప్రభుత్వం సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తుండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు.
  ఒకటి, రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
   స్థలాన్వేషణలో సర్కారు.. 
 జిల్లాలో సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
 ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి ఐదు ఎకరాల భూమి కావాలి. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వేల ఎకరాల భూమి అవసరమవుతుంది.
 పల్నాడు ప్రాంతంలోని గురజాల రెవెన్యూ డివిజన్‌లో సోలార్ హబ్ ఏర్పాటుకు అవసరమైన అసైన్డ్ స్థలం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు.

మరిన్ని వార్తలు