నిద్ర పట్టడం లేదా ..ఇదిగో స్లీప్‌ ల్యాబ్‌

30 Dec, 2019 02:56 IST|Sakshi

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో నిద్ర ప్రయోగ శాల

పిల్లలకూ నిద్రలేమి సమస్య గుర్తించాల్సింది తల్లిదండ్రులే

నిద్రలేమితో అనేక అనర్థాలు

వైద్య నిపుణుల వెల్లడి

తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది

ఆ బాలిక పేరు మానస. నిండా 13 ఏళ్లు కూడా లేవు. ఆమెకు ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ.. ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. చాలామంది డాక్టర్లకు చూపించారు. నిద్ర మత్తు ఆవహించే మందుల్ని కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో చెబితే.. తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి న్యూరాలజీ విభాగంలో చూపించగా.. అక్కడి స్లీప్‌ ల్యాబ్‌లో రాత్రంతా ఉంచి పరీక్షలు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే బాలిక నిద్రపోవటం లేదనే విషయాన్ని వైద్యులు నిర్థారించి.. కంటి నిద్ర రావటానికి వీలుగా తగిన సూచనలిచ్చారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం.

గుంటూరు (మెడికల్‌)
సాధారణంగా వయసు మీరిన వారికి నిద్ర పట్టదని అనుకుంటారు. కానీ.. చిన్న పిల్లలూ, యువకులు సైతం నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, స్మార్ట్‌ ఫోన్స్‌ యుగంలో ప్రతి ఒక్కరూ కాలంతో పరుగులు తీస్తుండటం వల్ల పాఠశాల విద్యార్థి మొదలుకుని పెద్దవారి వరకు అనేక మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేనిపక్షంలో అనేక అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఎందరికో పరిష్కారాన్ని చూపిస్తోంది గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్‌).

తొలి ఆస్పత్రిగా రికార్డు
‘మీకు నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్‌కు రండి’ అని ఆహ్వానిస్తున్నారు అక్కడి వైద్యులు. నిద్ర పట్టకపోవటానికి గల కారణాలను వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని హాయిగా నిద్రపోయేందుకు అవసరమైన వైద్యాన్ని జీజీహెచ్‌ డాక్టర్లు అందిస్తున్నారు. ఇక్కడి న్యూరాలజీ వైద్య విభాగంలో నిద్ర ప్రయోగ శాల (స్లీప్‌ ల్యాబ్‌)ను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో  స్లీప్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి రికార్డు సృష్టించింది. నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్‌ నన్నపనేని వెంకయ్యచౌదరి ఇక్కడి ల్యాబ్‌కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు.

నిద్ర సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు
తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించడం, సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, నిరాశ, నిస్సత్తువ, నీరసం, విసుగు, తలనొప్పి, ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడేవారు శారీరక, మానసిక పటుత్వాన్ని కోల్పోతారు. ఉద్విగ్నతలకు లోనవుతారు. మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోని పక్షంలో పై రుగ్మతలతో పాటు గుండెపోటు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా నిద్రపట్టదు. ఊబకాయంతో ఉన్నవారు సైతం రాత్రిళ్లు నిద్రపట్టక గురక సమస్యతో నిద్రాభంగమై ఇబ్బంది పడతారని, నిద్రలో నడవడం, నిద్రలోనే సైకిల్‌ తొక్కినట్లు కాళ్లు కదిలించడం, ఫిట్స్‌ రావడం వల్ల నిద్రపోవటానికి భయపడతారని వైద్యులు వివరిస్తున్నారు.

రుగ్మతల నిర్ధారణకు స్లీప్‌ల్యాబ్‌
ఈ రుగ్మతలు రావడానికి గల కారణాలు నిర్ధారించేందుకు స్లీప్‌ ల్యాబ్‌ ఉపయోగపడుతుంది. కొంతమంది రాత్రివేళలో నిద్రపోకుండా, పగటి పూట నిద్రిస్తుంటారు. దీనివల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ అనేకం ఉంటాయి. ఎలాంటి సమయాల్లో నిద్రపోవాలి, నిద్ర పోకపోతే  ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయనే విషయాలను స్లీప్‌ డిజార్డర్‌తో బాధపడేవారికి స్లీప్‌ ల్యాబ్‌లో వైద్య పరీక్షలు చేసి వివరిస్తున్నారు. నిద్రపట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం ద్వారా సమస్యను త్వరితగతిన సులభంగా నయం చేయవచ్చని, అందుకోసం స్లీప్‌ ల్యాబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్‌ నాగార్జునకొండ సుందరాచారి తెలిపారు.

పరీక్షల విధానం ఇలా..
ఒక్కో వ్యక్తికి వైద్య పరీక్ష చేసేందుకు సుమారు 8 గంటలకు పైగా సమయం పడుతుంది.

► సుమారు 30 నుంచి 40 వరకు వైర్లను శరీరంలోని వివిధ భాగాలకు అతికిస్తారు.

► రాత్రి వేళల్లో సహజ సిద్ధంగా నిద్రించే సమయంలో ఈ పరీక్ష నిర్వహించటం ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి.

► ఇక్కడి ల్యాబ్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పరీక్షలు చేస్తారు. – ఆస్పత్రి ఓపీ విభాగంలో మంగళ, గురు, శనివారం న్యూరాలజీ విభాగానికి వచ్చిన వారికి నిద్ర సమస్యలు ఉంటే స్లీప్‌ల్యాబ్‌లో పరీక్ష చేసి చికిత్స అందిస్తారు.

► వైద్య పరీక్షలు చేసే సమయంలో ప్రత్యేక శిక్షణ పొందిన న్యూరో టెక్నీషియన్‌తో పాటు ఒక డాక్టర్, రోగి అటెండెంట్‌ ఉంటారు.

►  నిద్ర సమస్యలపై పరిశోధన చేసేందుకు ఒక పీజీ డాక్టర్‌ను ప్రత్యేకంగా నియమించారు.

రెండేళ్లుగా ఉచిత పరీక్షలు
స్లీప్‌ల్యాబ్‌ను 2017 జూలైలో ప్రారంభిం చినా వైద్య పరీక్షలు మాత్రం 2018 జనవరి నుంచి చేస్తున్నాం. 2018లో 47 మందికి, 2019 లో 40 మందికి స్లీప్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించాం. నిద్ర సమస్యలతో వచ్చే వారిలో మగవారే ఎక్కువగా ఉంటున్నారు. 13 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు వారు కూడా నిద్ర సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం రావటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువగా 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే నిద్రలేమి సమస్యలను నిర్ధారించే పాలిసోనోగ్రఫీ (పీసీజీ) పరీక్ష చేస్తున్నాం. సుమారు రూ.25 వేలు ఖర్చయ్యే ఈ పరీక్షను న్యూరాలజీ విభాగంలో ఉచితంగా చేస్తున్నాం.    

– డాక్టర్‌ నాగార్జునకొండ సుందరాచారి, విభాగాధిపతి, న్యూరాలజీ వైద్యం

మరిన్ని వార్తలు