పాలనలో గుంటూరే కీలకం!

19 Nov, 2014 00:58 IST|Sakshi
గుంటూరు నగరం ఏరియల్ వ్యూ

 రాజధానిగా ప్రకటించడంతో పెరిగిన జిల్లా ప్రాధాన్యం
 రానున్న రోజుల్లో ఇక్కడి నుంచే పరిపాలన!
 వచ్చే నెలలోనే ఇక్కడ  మంత్రుల క్యాంపు కార్యాలయాలు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో : విద్య, వ్యవసాయం, రాజకీయ రంగాల్లో పురోగతి సాధించిన గుంటూరు జిల్లా రాష్ట్ర పాలనలో కీలకం కానుంది. పరిపాలన, రాష్ట్ర ఆర్థిక ప్రగతి, ఉన్నతాధికారులు, న్యాయశాస్త్ర కోవిదులకు కేంద్ర బిందువు కానుంది. రాష్ట్రానికి నూతన రాజధాని ప్రాంతంగా తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాలను ఎంపిక చేయడంతో జిల్లా ప్రాధాన్యత పెరిగింది. దీనికితోడు వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాగార్జున యూనివర్శిటీలో జరిగే అవకాశముందని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. దీంతో రానున్న రోజుల్లో ఇక్కడి నుంచే పరిపాలన సాగించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమవేశాలు మొదలయ్యేలోగానే బెజవాడ, గుంటూరుల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత, పీతల సుజాత తదితరులు ఈ రెండు నగరాల్లో అనువైన చోట క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నారు.

ప్రధాన శాఖలు కూడా గుంటూరు జిల్లాకు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, విపత్తుల నివారణ సంస్థ, డీజీపీ కార్యాలయం ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రకటన చేసింది. నాగార్జున యూనివర్శిటీలో అసెంబ్లీ సమావేశాలు జరిగేట్లయితే, అన్ని జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఇతర ముఖ్య అధికారులు ఇక్కడికొస్తారు. అసెంబ్లీ సమావేశాలు  జరిగినన్ని రోజులూ ఇక్కడే ఉంటారు. వీరందరికీ తాత్కాలికంగా వసతి సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం గుంటూరు, విజయవాడ నగరాల్లోని ప్రభుత్వ అతిథి గృహాలు, ప్రైవేటు హాటళ్లులోనూ గదులు బుక్ చేయాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు బహుళ అంతస్తుల భవనాల్లోని ఖాళీ ఫ్లాట్లను కూడా అద్దెకు తీసుకునే వీలుంది.
 
 1953లోనే గుంటూరులో అసెంబ్లీపై చర్చ

 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు 1953 - 56 మధ్య కాలంలో గుంటూరు జిల్లాకు చెందిన నల్లపాటి వెంకట్రామయ్యచౌదరి  శాసనసభకు మొదటి స్పీకర్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే గుంటూరు కేంద్రంగా అసెంబ్లీ నడపాలన్న చర్చ వచ్చిందని సీనియర్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు