మూడు గంటలు.. హైటెన్షన్‌

24 Mar, 2020 11:19 IST|Sakshi
ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్న వలంటీర్లు

గుంటూరులో మూడుగంటల పాటు హైటెన్షన్‌ నడిచింది. శ్యామలానగర్‌లో కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం అలర్ట్‌  అయ్యింది. వెంటనే కలెక్టర్‌ ఆగమేఘాల మీద క్షేత్ర స్థాయికి వచ్చారు. ఆయన వెంట జిల్లా యంత్రాంగం పరుగులు తీసింది. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి. పెరి మీటర్‌ కంట్రోల్‌ టీమ్‌ (పోలీసులు) లక్షణాలు కనిపించిన ప్రదేశం నుంచి మూడు కిలో మీటర్ల చుట్టూ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఏ ఒక్కరిని బయట నుంచి లోనికి, లోపలి నుంచి  బయటికి వెళ్లనీయకుండా ఆంక్షలు విధించింది. పబ్లిక్‌ అడ్రస్‌ ఇన్‌ సిస్టమ్‌ బృందం ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలో హౌస్‌ హోల్డ్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ కరోనా లక్షణాలు ఉన్న బాధితుడిని గుర్తించింది.

అతను కలుసుకున్న వ్యక్తుల వివరాలు, ప్రయాణించిన ప్రాంతాల వివరాలను సేకరించింది. ప్రత్యేక అంబులెన్స్‌లోకి బాధితుడిని ఎక్కించారు. క్వారంటైన్‌ టీమ్‌ ఆ ప్రాంతంలో దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్న వారి నుంచి శాంపిల్స్‌ సేకరించింది. మరోవైపు  కమర్షియల్‌ దుకాణాలు, హోటళ్లను అధికారులు మూయించి వేశారు. ఆ ఏరియా మొత్తం పారిశుద్ధ్య డ్రైవ్‌ చేపట్టారు. అనంతరం కొద్ది నిమిషాల తర్వాత ఒక్కసారిగా చప్పట్లు మార్మోగాయి. మాక్‌ డ్రిల్‌ సక్సెస్‌ అంటూ ప్రత్యేక బృందాలు సందడి చేశాయి. అప్పటి వరకు నిజంగా కరోనా లక్షణాలు బయటపడ్డాయని భయపడిన ప్రజలు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. కలెక్టర్‌ సిబ్బందిని, అందుకు తగ్గట్టుగా సహకరించిన ప్రజలను అభినందించారు.

సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో కరోనా కేసు నమోదైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై శ్యామలానగర్‌లోని వార్డు సచివాలయంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ డ్రిల్‌లో జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యాస్మిన్, నగర కమిషనర్‌ చల్లా అనురాధ, ఏఎస్పీ గంగాధరం, మున్సిపల్‌ ఆర్డీ వెంకటేశ్వర్లుతో పాటు, ప్రత్యేక తొమ్మిది బృందాలు పాల్గొన్నాయి. మూడు గంటలపాటు క్షేత్రస్థాయిలో ఈ బృందాలు పర్యటించి తమకు ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీగా రూపొందించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలు ఉంటాయన్నారు.  కేసు నమోదైన వెంటనే డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో రాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లు అక్కడికి చేరుకుని కేసు నమోదైన పాయింట్‌ నుంచి మూడు కిలో మీటర్ల చుట్టూ ఉన్న  ప్రాంత పరిధిలో  ప్రత్యేక చర్యలు చేపడతాయన్నారు. 

ప్రత్యేక బృందాల పని:
మొదట పెరిమీటర్‌ కంట్రోల్‌ టీమ్‌లో ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలతోపాటు సిబ్బంది ఉంటారు. కేసు నమోదైన ప్రాంతం మూడు కిలో మీటర్ల చుట్టూ  ప్రజల రాకపోకలను నియంత్రిస్తారు.
పబ్లిక్‌ అడ్రస్‌ ఇన్‌ సిస్టమ్‌ టీమ్‌ కింద మూడు బృందాలు ఉంటాయి. వీరు ఆ ప్రాంతంలోని ప్రజలను ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు చేస్తారు.  
కంట్రోల్‌ రూమ్‌ టీమ్‌లో వార్డు సెక్రటరీ ఉండి మానిటరింగ్‌ చేస్తారు. క్లస్టర్‌లో ఉన్న అధికారులకు ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించి వివరాలు తెలియజేస్తారు.  
హౌస్‌ హోల్డ్‌ సర్వెలెన్స్‌ టీమ్‌ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించిన తర్వాత అతనితో ఎవరు కలుసుకున్నారు, అతను ఎక్కడెక్కడ ప్రయాణించాడు, అతను కలుసుకున్నవారు మళ్లీ ఎవరితో కలిశారు.. వంటి వివరాలు సేకరిస్తారు. ఇందులో క్లస్టర్‌ల వారీగా ఆశవర్కర్లు, ఏఎన్‌ఎం, హెల్త్‌ సూపర్‌ వైజర్ల, వలంటీర్లు ఉంటారు. కేసు నమోదైన ఇంటిలోకి గ్లౌజ్, మాస్క్‌ ధరించిన వారిని మాత్రమే లోనికి అనుమతి ఇస్తారు. నాలుగు క్లస్టర్‌లకు ఒక వైధ్యాధికారిని నియమించారు. ఇందులో 20 ప్రత్యేక బృందాలు ఉంటాయి.
శానిటేషన్‌ టీమ్‌ ఆ ప్రాంతం మొత్తం పారిశుద్ధ్యం డ్రైవ్‌ను చేపడుతోంది. క్వారంటైన్‌ టీమ్‌ సభ్యులు ఆ మూడు కిలో మీటర్ల ఏరియా పరిధిలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే క్వారంటైన్‌ సెంటర్‌కు తీసుకెళ్లి వారి శాంపిళ్లను తీసి పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు ఉంటే వారిని వెంటనే ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా జీజీహెచ్, ఐడీఎల్‌ ఫీవర్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తారు.  
కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌ మేనెజ్‌ మెంట్‌ టీంలో కమర్షియల్‌ శాఖ అధికారులు, తూనికలు, కొలతల శాఖ, పోలీసు సిబ్బంది ఉంటారు. ఆ ప్రాంత పరిధిలోని కమర్షియల్‌ దుకాణాలు మూయించి వేస్తారు.  
హాస్పిటల్‌ సర్వెలెన్స్‌ టీంలో వైద్యాధికారులుంటారు. ఆ ప్రాంత పరిధిలోని పబ్లిక్, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఇటీవల ఆస్పత్రిలో చేరిన రోగుల వివరాలను పరిశీలిస్తారు.  మూడురోజుల్లో ఆస్పత్రులో నమోదైన హైరిస్క్, లోరిస్క్‌ కేసులను కంట్రోల్‌ రూంకు చేరవేసి, అలెర్ట్‌ చేస్తారు. ఈ టీమ్‌లో వారు ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి వారికి ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీగా రూపొందిస్తారు.  జిల్లాలో ఏ ప్రాంతంలో కేసులు నమోదైనా ఈ ప్రక్రియలోనే పనిచేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు