లింకు ఎక్కడ? కీలకంగా మారిన సెల్‌ ఫోన్‌..

24 Apr, 2020 13:41 IST|Sakshi

ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్‌ కాంటాక్ట్‌లు

నేటికీ అంతుచిక్కని కొన్ని కేసుల మూలాలు

ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్‌లపై పోలీసుల ప్రత్యేక దృష్టి

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో డ్రోన్‌లతో నిఘా

సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరణ కలవరపెడుతోంది. అనుమానిత వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యేలోగా అతను అనేక మందిని కలుస్తున్నాడు. ఫలితంగా కాంటాక్ట్‌లు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ బారిన పడిన వ్యక్తి ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? అతని కుటుంబ సభ్యులను ఎవరు కలిశారు? ఇలా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల ఛేదనలో పోలీసులు తలమునకలవుతున్నారు. క్రిమినల్‌ కేసుల కంటే లోతుగా ప్రతి కరోనా పాజిటివ్‌ కేసును విచారిస్తున్నారు. 

లింక్‌ బ్రేక్‌ చేసేందుకు..
చైన్‌ మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ లింకును ఎక్కడో ఒక చోట బ్రేక్‌ చేసేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోంది. ఇందుకోసం డీఐజీ, అర్బన్‌ ఇన్‌చార్జి ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. ఈ బృందాలు ప్రతి కేసులో వైరస్‌ సోకడానికి మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే గుంటూరు నగరంలో నమోదైన రెండు, తాడేపల్లిలో నమోదైన ఒక పాజిటివ్‌ కేసు మూలాలు మాత్రం అంతుచిక్కడం లేదు. ఈ కేసులను వివిధ కోణాల్లో విచారణ చేసినప్పటికీ వారికి వైరస్‌ ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.

కీలకంగా మారిన సెల్‌ ఫోన్‌..
కాంటాక్ట్‌ కేసుల గుర్తింపులో సెల్‌ టవర్‌ లొకేషన్, కాల్‌ డేటా కీలకంగా మారుతోంది. గుంటూరు రూరల్‌లో ఇటీవల దాచేపల్లి, నరసరావుపేటలో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ రెండు కేసుల్లో మృతుల సెల్‌టవర్‌ లొకేషన్, కాల్‌ డేటా ద్వారానే వారికి ఎలా వైరస్‌ సోకింది, ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అన్న విషయాలను త్వరగా  గుర్తించగలిగారు. అనుమానితులను వేగంగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.  రెడ్‌జోన్‌ మండలాల్లోని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో డ్రోన్, సీసీ కెమెరాలతో పోలీసులు నిరంతర నిఘా ఉంచారు.

మూడు అంశాలపై దృష్టి..
కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడో గుర్తించడం.  
ఆయా ప్రదేశాల్లో ఎవరెవరిని కలిశాడో తెలుసుకుని వారిని ట్రేస్‌ చేయడం.
వారికి వైద్య పరీక్షలు (టెస్టింగ్‌) చేయిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు