భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

25 Oct, 2013 02:10 IST|Sakshi
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో రాగల 48 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున గ్రామ, మండల, డివిజన్ జిల్లాస్థాయి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక ్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, శుద్ధమైన నీటిని సరఫరా చేయాలన్నారు. అవసరమైతే స్వచ్చంద సంస్థల, దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, రాత్రి సమయాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని చె ప్పారు. కేంద్రాల వద్ద సంపూర్ణ పారిశుధ్యం ఉండేలా చూడాలన్నారు.
 
 ప్రతి పునరావాస కేంద్రంలో ఏర్పాట్ల పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించుకోవాలన్నారు. గ్రామాల్లో, పంట పొలాల్లో నీరు నిల్వలేకుండా తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు.  రహదారులపై వాగులు, వంకలు పొంగుతున్న చోట ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు. వర్షాలు, వరదలు పూర్తిగా తగ్గే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటి కపుడు పరిస్థితులను సమీక్షించుకుని, తదనుగుణమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అర్బన్ ఎస్పీ బి.వి రమణకుమార్ మాట్లాడుతూ పునరావాస, సహాయ కార్యక్రమాలలో పోలీసు అధికారులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జె.సి వివేక్ యాదవ్, అదనపు జె.సి కె.నాగేశ్వరరావు, డి.ఆర్వో నాగబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు