పోలీసులు ప్రజల పక్షం

17 Jun, 2019 09:59 IST|Sakshi

గుంటూరు రూరల్‌ ఎస్పీ ఆర్‌ జయలక్ష్మి

సాక్షి, గుంటూరు : పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్‌ కోరలు పీకడానికి ప్రణాళిక రచించారు. పేకాట క్లబ్‌ షో ముగించేందుకు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే బెల్ట్‌ షాపులకు ఉచ్చు బిగిస్తానని హెచ్చరిస్తున్నారు. శాంతి, భద్రతల పరిరక్షణ, మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యమని, దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్‌ జయలక్ష్మి చెబుతున్నారు. పోలీసుశాఖలో అవినీతిని సహించబోమని  సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె హెచ్చరించారు. 

బెల్ట్‌ షాప్‌లు, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్, గుట్కా, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. పోలీస్‌ శాఖలో అవినీతికి పాల్పడితే ఏ స్థాయి ఉద్యోగులనైనా వదిలే ప్రస్తకి లేదని తేల్చి చెప్పారు. పల్నాడులో సమస్యాత్మక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయమని స్పష్టం చేశారు.

వివరాలు ఆమె మాటల్లో..  
జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు పోలీస్‌ శాఖపై నమ్మకాన్ని పెంపొందించడమే నా లక్ష్యం. పోలీస్‌ అంటే ప్రజల పక్షమని అంతా భావించేలా చర్యలు తీసుకుంటున్నాం. పోలీసులు ఏ ఒక్కరి ప్రయోజనాల కోసం పని చేయరని, అందరి కోసం ఉంటారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఆరు నెలల్లో అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. రూరల్‌ జిల్లాలో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజంపై సీరియస్‌గా దృష్టి సారించాం.

గ్రామాల్లో గొడవలకు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించడంతోపాటు ప్రజలంతా కలిసి మెలసి ఉండేలా అవగాహన కల్పిస్తాం. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల పల్నాడులోని అనేక గ్రామాల్లో ప్రజల మధ్య రాజకీయ చిచ్చు రాజుకుంది. పోలీస్‌ అధికారులు కొందరు గతంలో వ్యవహరించిన తీరు ఇందుకు కారణం. అయితే ఇక నుంచి అది కుదరదు. 

పోలీసులు అవినీతి పాల్పడితే సహించం
పోలీస్‌ అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదు. ఎవరి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వహించొచ్చు. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలి.హోంగార్డుæ నుంచి ఏఎస్పీ వరకూ ప్రతి ఒక్కరు పారదర్శకత కోసం కృషి చేయాలి. అందరూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ దిశగా అడుగులు వేయాలి. నిజాయితీగా పనిచేసే వారికి మద్దతుగా నిలుస్తాం.  

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు  
బెల్ట్‌ షాప్‌లు, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్, గుట్కా, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు. అందుకు సహకరించే పోలీస్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వీటిపై సమాచారం అందించాలనుకునే వారు నేరుగా నా నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పవచ్చు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. బెల్ట్‌ షాప్‌లకు మద్యం సరఫరా చేసే దుకాణాలను సీజ్‌ చేయడంతోపాటు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.  

మరిన్ని వార్తలు