గురుభ్యోనమః

16 Jul, 2019 10:45 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : గురుర్బహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః /గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః’ అని వేదాల్లో గురువు ప్రాముఖ్యతను వివరించారు. గురు పూజకు శ్రేష్ఠమైన గురు పౌర్ణమిని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు విశేషంగా జరుపుకొంటారు. ఆషాడ శుద్ధ పౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఇదే రోజు వ్యాస మహాముని జన్మ తిథి కనుక మహా పర్వదినంగా భావించి గురు పౌర్ణమి వేడుక నిర్వహించుకుంటున్నారు.

ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సాధారణ పండుగలకు గురుపౌర్ణమి భిన్నమైనది, గురు సమానులైనవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం ఇందులోని ప్రత్యేకత. ఈ రోజును ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నిర్వహించుకుంటూ తమ గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించుకుంటారు. అన్ని స్థానాల్లో గురుస్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుంచి జ్ఞానమనే వెలుగుల వైపు నడిపించే శక్తి కలిగినవారు గురువులు. అటువంటి గురువులను పూజించడం మన సంప్రదాయం.

ఏటా హిందువులు ఆషాడ పౌర్ణమి నాడు వేదవ్యాసుని జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకొంటున్నారు. అదేవిధంగా సాయిబాబా కూడా తాను జీవితమంతా గురు సేవ చేసిన సంప్రదాయాన్ని తన శిష్యులు కూడా పాటించాలని షిర్డీలో భక్తులకు ఆదేశించినట్టు ప్రతీతి. గురు పౌర్ణమినాడు సాయిబాబాకు కూడా ప్రత్యేక హారతులు సమర్పిస్తారు. భారతీయ సంస్కృతిలో విడదీయలేని భాగమైనది వేదవ్యాసుని మహా భారతం. అదేవిధంగా 108 ఉప పురాణాలు రచించినది కూడా వేద వ్యాసుడే.

గురు పౌర్ణమినాడు సాయిబాబా ఆలయాల్లో స్వామివారికి ఇచ్చే హారతులను దర్శించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కొందరు భక్తులు సాయిబాబా ఆలయాల్లోని దత్తాత్రేయ స్వామివారికి శనగలను దారానికి గుచ్చి మాలలా అలంకరించి పూజలు చేస్తారు. మరికొన్ని ఆలయాల్లో దక్షిణామూర్తి చిత్రపటం వద్ద తెల్లని పుష్పాలు ఉంచి పూజలు చేస్తారు. పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించి భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. వివాహం కాని వారు గురు పౌర్ణమి రోజున కోకిలా వ్రతం ఆచరిస్తారు.  

బియ్యం పిండిలో నీళ్లు కలిపి కోకిల బొమ్మ చేసి పూజిస్తారు. బెల్లం ప్రసాదంగా ఉంచుతారు. గురుపౌర్ణమి రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే శివ శయనోత్సవం. అంటే శివుడు ధ్యానంలోకి వెళ్తాడు. శివుడు ధ్యానంలో ఉన్న చిత్రపటం వద్ద తెల్ల పుష్పాలు ఉంచి పూజిచడం ద్వారా ఆర్థిక బాధలు తొలగిపోతాయని, శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.  ఇలా గురు పౌర్ణమి నాడు వ్యాసమహర్షి, సాయిబాబా, దత్తాత్రేయస్వామి, శివుడిని పూచించడం ప్రత్యేక విశిష్టత.

అమ్మానాన్నల తర్వాత అంతటి ప్రాధాన్యం గురువుకు ఉంది. సాయిబాబా సద్గురువు. మనిషి ఎలా జీవించాలో.. సమత, మమత, మానవతను ఏ విధంగా ఆచరించాలో చేసి చూపారు. బాబా బోధనలు వికాసాన్ని, ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను కలిగిస్తాయి. అందువల్లే సాయిబాబా ఆలయంలో ఈ రోజు వేకువ నుంచే ప్రత్యేక పూజలు, సుప్రభాత సేవలు, హారతులు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సాయి ఆలయంలో కొలువై ఉన్న దత్తాత్రేయునికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాల్లో అన్నదానాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. 

నేడు శింగరకొండ గిరి ప్రదక్షిణ

అద్దంకి: ఆషాడ శుద్ధ పూర్ణిమ సందర్భంగా శింగరకొండ గిరి ప్రదక్షిణ(కొండ చుట్టూ), కొండ పైన ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి, మెట్లోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. రమ్య ఫౌండేషన్‌ సహకారంతో లక్ష్మీ నరసింహ స్వామి మెట్ల వద్ద నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, 99 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాల మీదుగా, గోపాలపురం, భవనాశి రిజర్వాయర్‌ కట్టమీదుగా తిరిగి మెట్ట వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుందని చెప్పారు. కోలాటం, భజన కార్యక్రమాలతోపాటు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.    

>
మరిన్ని వార్తలు