ఎవరెస్టంత ఎదిగారు

18 May, 2018 04:44 IST|Sakshi

శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు గురుకుల విద్యార్థులు

అభినందనలు తెలిపిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు గురువారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 22 మంది ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లగా వారిలో ఒకరు విరమించుకున్నారు.

మిగిలిన 21 మందిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న జె.ప్రవీణ్, కొత్తూరు గురుకులంలో చదువుతున్న పి.భానుసూర్యప్రకాష్, విశాఖపట్నం జిల్లా వెలుగొండ గురుకులంలో జూనియర్‌ ఎంపీసీ చదువుతున్న జి.రాజు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గురుకులంలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గురుకులంలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న ప్రసన్నకుమార్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారిలో ఉన్నారు.

గతేడాది 9 మంది విద్యార్థులు ఈ రెండు విద్యా సంస్థల నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు లడక్‌లో మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణ పొందారు. మూడు బృందాలుగా బయల్దేరిన వీరిలో మొదటి బృందం విజయం సాధించింది. రెండో బృందం ఈ నెల 19వ తేదీ ఎవరెస్ట్‌ను అధిరోహించనుంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం అభినందనలు తెలిపారు.

ఆత్మ విశ్వాసం పెరగాలి: సీఎం
విద్యార్థులు శిఖరమంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకొని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్థుల మనోస్థైర్యాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శిఖరారోహణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, కష్టాలను తట్టుకునే ధృడత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబును, ఆయా శాఖల అధికారులను సీఎం అభినందించారు.  

మరిన్ని అధిరోహణలు సాధించాలి: వైఎస్‌ జగన్‌
ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అధిరోహణలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం వైఎస్‌ జగన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా