ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు

12 Mar, 2018 09:29 IST|Sakshi
ఐటీడీఏ ఎదుట నినాదాలు చేస్తున్న విద్యార్థినులు

గురుకుల విద్యార్థినుల ఆందోళన

ఐటీడీఏ వద్ద బైఠాయింపు

మానసికంగావేధిస్తున్నారని ఆవేదన

స్పందించిన గిరిజన సంక్షేమశాఖ మంత్రి, డీడీ

గురుకుల సొసైటీకి ప్రిన్సిపాల్‌ సరెండర్‌

పాడేరు: పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సలోమి తీరుపై విద్యార్థినులు నిరసన గళమెత్తారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థినులు కళాశాల నుంచి ప్రదర్శనగా ఐటీడీఏకు వెళ్లారు. కార్యాలయం ముందు ప్లకార్డులతో బైటాయించారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినులను నిత్యం మానసికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పరీక్షల సమయంలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు స్పందించిన గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విజయకుమార్‌ ఐటీడీఏకు చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థినులందరినీ కళాశాలకు తరలించారు. దీని గురించి తెలుసుకున్న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్పందించి, ఈ వ్యవహారంపై ఆరాతీశారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు డీడీ విజయకుమార్‌ కళాశాల ఆవరణలో విద్యార్థినులు, కళాశాల సిబ్బందితో విడివిడిగా మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ సలోమి ప్రస్తుతం పరీక్షల సమయంలోనూ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, విద్యార్థినులను కొట్టడం, తిట్టడం, వేధింపులకు గురి చేస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని విద్యార్థినులు డీడీకి ఫిర్యాదు చేశారు.

ప్రిన్సిపాల్‌ సరెండర్‌..
విద్యార్థినుల ఆందోళనకు సంబంధించి ప్రిన్సిపాల్‌ సలోమిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆమెను  గిరిజనసంక్షేమ గురుకుల సొసైటీకి సరెండర్‌ చేసినట్టు డీడీ విజయకుమార్‌ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఈ కళాశాలలో ఇంటర్‌ పరీక్ష కేంద్రానికి ఆమె డీవోగా విధులు నిర్వర్తిస్తున్నారని, దీంతో ఇంటర్‌ బోర్డ్‌ ఆర్‌ఐవోకు కూడా ఈమెను సరెండర్‌ చేసినట్లు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈమె స్థానంలో అరకు గురుకుల కళాశాల జేఎల్‌ భవానిని ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు