గుట్కా.. ఉండరిక!

1 Sep, 2018 13:39 IST|Sakshi
వివిధ రకాల పేర్లతో ప్యాకెట్లలో ఉన్న మత్తు పదార్థాలు

జిల్లాలో జోరుగా గుట్కా, ఖైనీ విక్రయాలు నిషేధం శూన్యం

బానిసలవుతున్న యువత పట్టించుకోని అధికారులు

రాజంపేట రూరల్‌: ‘ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం’అనే ప్రకటనలను సినిమా థియేటర్లలో, టీవీల్లో నిత్యం చూస్తేనే ఉన్నా యువత వాటికి బానిసలవుతూనే ఉన్నారనేది జగమెరిగిన సత్యం. పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించినా అధిక మొత్తంలో బహిరంగంగానే వాటి విక్రయాలు సాగుతున్నాయని తల్లదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిషేధించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో వ్యాపారులు అధిక లాభాలు గడిస్తున్నారనేది బహిరంగ రహస్యం.

ఇతర రాష్ట్రాల నుంచి రవాణా
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2006 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం పొగాకు ఉత్పత్తుల, విక్రయాలపై నిషేధం విధించారు. అయినప్పటికీ జిల్లాలో వ్యాపారులు, విక్రయదారులు యథేచ్చగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తూ యువత ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో చిత్తూరు, అనంతపురం జిల్లాల మీదుగా మన జిల్లాకు గుట్టు చప్పుడు కాకుండా గుట్కా, ఖైనీలు వచ్చి పడుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటి, పట్టణం, మండల హెడ్‌ క్వార్టర్స్‌తో పాటు ప్రతి గ్రామంలో వీటి విక్రయాలు జోరుగాసాగుతున్నాయి.

నిండు జీవితం బలి
విచ్చలవిడిగా గుట్కా, చైనీఖైనీ, వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో యువత వాటికి బానిసలవుతున్నారు. చిన్న వయసులోనే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్, గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులను, మత్తు మందులను వినియోగించే వారు 17 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే అధికంగా ఉన్నారు. తాము వద్దని వారించినా అలవాటు పడిన వారు పెడచెవిన పెట్టి యథేచ్చగా వాటిని వినియోగిస్తూ రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

రకరకాల పేరులతో, అధిక రేట్లతో...
పొగాకు ఉత్పత్తులను రకరకాల పేర్లతో ఎంఆర్‌పీ ధర లేకుండా అధికరేట్లకు విక్రయిస్తున్నారు. వీటిలో ఎంజీఎం, హాన్స్, చైనీఖైనీ, మిరాజ్, విమల్‌ వంటివాటికి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బారీ గిరాకీ ఉంది. వీటిని విక్రయించే స్థలం, సమయం, పరిస్థితిని బట్టి 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అధిక ధర అయినప్పటికీ దొరకడమే భాగ్యం అన్నట్టుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.

నిషేధం ఏదీ?
నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని నిబంధనలు ఉన్నా కొందరు వ్యాపారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వాటిని యథేచ్చగా విక్రయిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు తప్ప దాడులు చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేసినా అవి కొంత మేరకే పరిమితమవుతున్నాయి. అదుపులోకి తీసుకున్నా వారికి పెద్దగా శిక్షలు లేకపోవడంతో తిరిగి విక్రయిస్తున్నారు. పూర్తి స్థాయిలో నిషేధం విధించేలా చర్యలు తీసుకోవడంలో జిల్లా స్థాయిలో పోలీసులు విఫలమవుతూ ఉన్నారని బాధితుల తల్లిదండ్రులు మివర్శిస్తున్నారు. లాభసాటి వ్యాపారాన్ని జిల్లాలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారులు, విక్రయదారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు వీటి విక్రయాలపై నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. అధికారుల కళ్లుగప్పి అధిక శాతం రైల్వేశాఖ ద్వారా రవాణా చేస్తున్నప్పటికి అక్కడ నిఘా కొరవడిందని జిల్లా ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వార్తలు