కాణిపాకంలో భారీ గుట్కా డంప్‌

24 Nov, 2018 12:01 IST|Sakshi
దుకాణంలో సోదాలు చేస్తున్న పోలీసులు

టీడీపీ సింగిల్‌విండో డైరెక్టర్‌ ఇంట్లో సోదాలు

రూ.2 లక్షల నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం

కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షిలో పలుమార్లు కథనాలు

కాణిపాకం : భారీగా నిషేధిత మత్తు పదార్థాలను స్థాధీనం చేసుకున్నారు. పోలీసులు శుక్రవారం టీడీపీ సింగిల్‌విండో డైరెక్టర్‌ మనోహర్‌నాయుడు ఇంటిలో సోదాలు చేశారు. భారీ ఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్థానిక ఎస్‌ఐ క్రిష్ణమోహన్‌ విలేకరులతో మాట్లాడుతూ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న శ్రీపాద ఎంటర్‌ ప్రైజెస్‌ దుకాణంలో గుట్కాలతో పాటు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో తనిఖీ లు చేపట్టామని తెలిపారు. రూ.50 వేల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం వడ్రాంపల్లె పంచాయతీలోని మిట్ట ఇండ్లు (దామరగుంట)లోని టీడీపీ సింగిల్‌విండో డైరెక్టర్‌ మనోహర్‌నాయుడు ఇంటిలోని గోడౌన్‌లో  సోదాలు చేశామన్నారు. ఈ క్రమంలో రూ.1.50 లక్షల మత్తు పదార్థాలను గుర్తించామని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. మనోహర్‌ నాయుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి స్వాధీనం చేసుకున్న డంప్‌ను చిత్తూరు ఆహార భద్రతా శాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.

సాక్షిలో వరుస కథనాలు : ఆలయ పరిసరాల్లో విచ్చలవిడిగా గుట్కాలతో పాటు నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని గతంలో సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు స్పందించడంతో అక్రమ వ్యాపారుల ఆటకట్టినట్లు అయ్యింది. ఇంకా అనేక దుకాణాల్లో మత్తు పదార్థాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
తిరుపతి క్రైం : నగరంలో నిషేధిత గుట్కాలను నిల్వ ఉంచిన ఇంటిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఆ శాఖ  ఎస్పీ రాధాకృష్ణ, సీఐ మద్దయ్యాచారి సిబ్బందితో కలసి అన్నమయ్య సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.2.45 లక్షల విలువైన 32 వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యాజమని పి.సుబ్రమణ్యంశెట్టిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత వస్తువులను ఫుడ్‌ కార్పొరేషన్‌ శాఖకు అప్పగించారు.

చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు
కాణిపాకం ఆలయానికి కిలో మీటర్‌లోపు నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఇవి ఎక్కువగా చిత్తూరు, బెంగళూరు నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ డీలర్లను ఏర్పాటు చేసుకొని విక్రయాలు సాగిస్తున్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు . ఎంతటి వారైనా కేసు నమోదు చేస్తాం.
– ఎస్‌ఐ క్రిష్ణమోహన్, కాణిపాకం

మరిన్ని వార్తలు