తెగించారు

21 Nov, 2018 09:13 IST|Sakshi
డీఎస్‌ఆర్‌ పుస్తకంలో గుట్కా కేసుకు సంబంధించి నిందితుల కాలమ్‌లో వారి పేర్లు నమోదు చేయని దృశ్యం

ఖాకీలను కొంటున్న గుట్కా మాఫియా

రాజమహేంద్రవరంలోనే తయారీ యూనిట్‌

పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు

సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరంలో గుట్కా మాఫియా కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిషేధిత గుట్కా ప్యాకెట్లను ఏకంగా రాజమహేంద్రవరంలోనే తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం లేని ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరుకు తీసుకొచ్చి పలువురు విక్రయిస్తున్నారు.
నగరం నడిబొడ్డున మెయిన్‌ రోడ్డులో తయారీ యూనిట్‌ నడుపుతూ లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. ముడిసరుకు, తయారీదారులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి ఇక్కడే తయారు చేస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు తమకు అందిన సమాచారంతో అడపాదడపా దాడులు చేసి పట్టుకుంటున్న సరుకు విక్రయిస్తున్న మొత్తంలో ఒక శాతం కూడా ఉండదు. ఇక పోలీసులు కూడా దాడులు చేస్తున్నా ఏ మాత్రం ఆగడంలేదు. పోలీసులనే గుట్కా మాఫియా కొనుగోలు చేస్తోంది.

జడలు విప్పిన గుట్కా మాఫియా..
ఇతర రాష్ట్రాల నుంచి యంత్రాంగం కళ్లు కప్పి గుట్కా ప్యాకెట్లను నగరానికి తీసుకురావడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో కొంతమంది గుట్కా వ్యాపారులు ఇక్కడే తయారు చేస్తున్నారు. నగరంలో వ్యాపారాలు చేస్తున్న బయట రాష్ట్రాల వ్యాపారులు ఈ యూనిట్లను విజయవంతంగా నడిపిస్తున్నారు. గత గురువారం రాజమహేంద్రవరం నగరంలోని మెయిన్‌ రోడ్డు మెరక వీధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్కా తయారీ యూనిట్‌పై పోలీసులు దాడులు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తయారీ యంత్రాలు, లక్షల విలువైన ముడిసరుకు, తయారైన సరకును పట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన గుట్కా మాఫియా పోలీసులతో అక్కడికక్కడే బేరసారాలు నడిపింది. యంత్రాలు, ముడిసరుకు వదిలేస్తే భారీగా ముట్టజెబుతామని ప్రతిపాదించింది. ప్రతిపాదనలకు ఒప్పుకున్న పోలీసులు యంత్రాలు, ముడిసరుకు వదిలేసి తయారైన ప్యాకెట్లలో రెండు బస్తాలు మాత్రమే స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ప్రతిపాదనలకు అనుగుణంగా కేసు...
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పోలీసులు కథ నడిపించారు. సీజ్‌ చేసిన రెండు బస్తాల సరకును భద్రపరిచి, నిందితులపై తూతూ మంత్రంగా కేసులు కట్టారు. స్టేషన్‌కు తీసుకువచ్చిన వారి పేర్లు బయటకు రాకుండా వారి తరఫున తయారీదారులు తమ వద్ద పని చేస్తున్న వారి పేర్లపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అసలు నిందితులైన తయారీదారులను వదిలేసి ఆ యూనిట్‌లో పని చేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురిపై పోలీసుల కేసులు నమోదు చేయడం విశేషం. అంతర్గత రిపోర్టులో నిందితుల పేర్లు నమోదు చేసుకున్న పోలీసులు, డీఎస్‌ఆర్‌లో గానీ, ఎఫ్‌ఐఆర్‌లో గానీ నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ గుట్కా వ్యవహారం పోలీసు వర్గాల్లో గుప్పుమంటోంది. నాలుగు రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నూతన ఎస్పీ షిమూషీ బాజ్‌పాయ్‌ దృష్టికి ఈ వ్యవహారం ఎక్కడ వెళుతుందోనని ఈ కేసులో భాగస్వాములైన వారు ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు