చంద్రబాబు ప్యాకేజీను స్వాగతించారు : జీవీఎల్‌

24 Jul, 2018 15:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక ప్యాకేజ్‌ను చంద్రబాబు స్వాగతించారని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు స్పష్టం చేశారు. ప్యాకేజ్‌ను స్వాగతిస్తూ మహానాడులో, శాసనసభలో చంద్రబాబు తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కింద వచ్చేవన్నీ ప్యాకేజ్‌ రూపాంలో వస్తాయని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఏపీ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జీవీఎల్‌ టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. బీజేపీ వల్లే  ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి విదేశీ నిధులు వస్తున్నాయన్నారు. ఏపీపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టి సాయం చేస్తున్నారన్నారు.

ప్యాకేజ్‌కు మద్దతుగా మద్దతుగా టీడీపీ చేసిన తీర్మానాలను ఆయన సభలో చదివి వినిపించారు. జీవీఎల్‌ ప్రసంగానికి టీడీపీ ఎంపీలు పలుమార్లు అడ్డుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ రాద్ధాంతం చేస్తోందని జీవీఎల్‌ మండిపడ్డారు. రూ లక్షా 27వేల కోట్లు ఏపీకి అదనంగా వస్తున్నప్పుడు అన్యాయం జరిగిందని టీడీపీ ఎలా అంటుందని నిలదీశారు. హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్‌ కాదు మల్టీపుల్‌ టర్న్‌లు తీసుకున్నారన్నారు. మరోవైపు చర్చ సందర్భంగా సీఎం రమేష్‌ను ఎం వెంకయ్య నాయుడు మందలించారు. ఏపీకి నీవు ఒక్కడివే ప్రతినిధి అనుకోవద్దని చురకలంటించారు.

కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్న చంద్రబాబు
కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్‌ విమర్శించారు. మోదీ నిధులతో చంద్రన్న బీమా పథకం అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే చంద్రబాబు సర్కార్‌ కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఇక హోదా ఉన్న రాష్ట్రాలకూ, లేని రాష్ట్రాలకూ తేడా లేదని చెప్పుకొచ్చారు. కృష్ణపట్నం కొత్త పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రెవిన్యూ లోటు కింద రాష్ట్రానికి కేంద్రం రూ 22,300 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు.

>
మరిన్ని వార్తలు