చేతిలో నెల రోజుల బిడ్డతో..

10 Apr, 2020 17:16 IST|Sakshi

పండంటి బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు కూడా కాలేదు.. అయినా కరోనా వైరస్‌పై పోరాడేందుకు విధుల్లో చేరారు. సెలవు తీసుకునే వెసులుబాటును పక్కకు పెట్టి.. విశాఖలో కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్నారు. మాతృత్వాన్ని, వృత్తి ధర్మాన్ని సమానంగా భావించి.. విపత్కర పరిస్థితుల్లో ఎంతో బాధ్యతతో, ప్రజాసేవ చేయాలనే పట్టుదలతో ముందుకు కదులుతున్నారు. ఆమె జీవీఎంసీ కమిషనర్‌ జి సృజన. 

సాక్షి, విశాఖపట్నం : విశాఖ మహానగరపాలక సంస్థ కమిషనర్‌గా విధులు నిర్వరిస్తున్న సృజన.. నెల రోజుల కిందట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆమె బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజుల్లోనే కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. ఇలాంటి సమయంలో విశాఖపట్నం లాంటి మహానగరంలో మున్సిపల్‌ కమిషనర్‌ అవసరం ఎంతమేర ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నియంత్రణకు తన అవసరం ఎంత ఉందో తెలిసిన సృజన.. వెంటనే విధుల్లో చేరారు. బిడ్డను భర్త, తల్లికి అప్పజెప్పి తన విధులకు హాజరవుతున్నారు. కేవలం ఆఫీస్‌కే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.  అలాగే పేద ప్రజలకు నిత్యావసరాలు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడి తన వంతు బాధ్యతను నిర్వరిస్తున్నారు. ఆమె ప్రసవానికి కొద్ది రోజుల ముందువరకు కూడా తన బాధ్యతలను నిర్వర్తించారు.

ఈ క్రమంలో విశాఖలోని ప్రస్తుత పరిస్థితులు, ఇతర అంశాలపై సృజన సాక్షి టీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో, జిల్లా యంత్రాంగం సహకారంతో కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నామని సృజన తెలిపారు. విశాఖలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..‘కరోనాతో అనుకోని క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా నియంత్రణలో భాగంగా నా పాత్రను నిబద్ధతతో పోషించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ప్రజల తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి అవసరం ఉంటుందని తెలుసు. కానీ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టాను. కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్నా. కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. కరోనా కట్టడికి సీఎం జగన్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆ స్ఫూర్తిలో నాది చిన్న పాత్ర. నా కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ధైర్యమిచ్చారు’ అని పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా