‘బొమ్మ’.. బొరుసు..!

15 May, 2019 12:47 IST|Sakshi
బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన హరికృష్ణ విగ్రహం (ఫైల్‌)

బీచ్‌రోడ్డులో మూడు విగ్రహాల కథ ముగిసిందా..? మొదలైందా.?

రాత్రికి రాత్రే వెలసిన విగ్రహాలు

అర్థరాత్రి తొలగింపుపైనా అనుమానాలు

కోర్టు ధిక్కరణ నోటీసులతో కదిలిన జీవీఎంసీ

నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లుగానే..బీచ్‌రోడ్‌లో విగ్రహాల ఏర్పాటు.. తొలగింపు వ్యవహారంలోనూ రెండు పార్శా్వలు ఉన్నాయి.. భిన్నమైన వాదనలూ వినిపిస్తున్నాయి.ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. దాదాపు ఏడు నెలల క్రితం రాత్రికి రాత్రే హడావుడిగా విగ్రహాలు ఏర్పాటు చేయడం..దానిపై రచ్చ జరగడం.. వివాదం న్యాయస్థానం మెట్లెక్కడం.. హైకోర్టు హెచ్చరికలు.. అయినా ఇన్నాళ్లూ జీవీఎంసీ మౌనముద్ర.. చివరికి కోర్టు ధిక్కరణ నోటీసుల వరకు రావడం.. ఇలా ఆది నుంచి ఈ బొమ్మల కథ వివాదాలమయంగానే కొనసాగింది.ఎట్టకేలకు హైకోర్టు అక్షింతలతోనే విగ్రహాలు తొలగించినా.. అదీ అర్ధరాత్రే పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేయడంతో విగ్రహాల కథ ముగిసిందనిపిస్తోంది.కానీ.. దాని వెనుకా రాజకీయమే నడిచిందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ బొమ్మల కథ కంచికి చేరిందా?.. కొత్త రూపంలో మళ్లీ తెరపైకి వస్తుందా??.. అన్నదే ఆసక్తికరం.

విశాఖసిటీ : బీచ్‌రోడ్డులో ముగ్గురు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు రాజకీయంగా రచ్చకు దారితీసింది. కొన్ని సంస్థలు ఆర్కే బీచ్‌లో గత నవంబర్‌ 30న  రాత్రి ఉన్నపళంగా దివంగత దాసరి నారాయణరావు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను ఏర్పాటు చేశాయి.  జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా విగ్రహం ఏర్పాటు చెయ్యాలంటే సంబంధిత జోన్‌ కార్యాలయంలోముందుగా దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే జీవీఎంసీ స్టాట్యూ కమిటీ ఛైర్మన్‌కైనా దరఖాస్తు చేసుకోవాలి. వారి నుంచి అనుమతి వస్తేనే విగ్రహం ఏర్పాటు చెయ్యాలి. నగరంలో కొన్ని చోట్ల మహనీయుల విగ్రహాల ఏర్పాటు దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ బీచ్‌రోడ్డులో మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే  రాత్రికి రాత్రే దిమ్మలు నిర్మించేసి.. విగ్రహాలు ఏర్పాటు చేసేశారు. వీటిని సాక్షాత్తు మంత్రి గంటా శ్రీనివాసరావే ప్రారంభించారు.

హైకోర్టు ఆగ్రహం
ఈ వ్యవహారం టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి తెలీకుండా ఎలా జరుగుతుందంటూ అప్పట్లో జీవీఎంసీ కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం.. దానికి తోడు అడ్డగోలుగా విగ్రహాలు ఏర్పాటుపై సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడంతో రచ్చ మొదలైంది. పూర్తిస్థాయి విచారణ తర్వాత పిల్‌ నం.19/2019ను హైకోర్టు స్వీకరించింది. అసలు విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు.? ఎవరి అనుమతితో ఏర్పాటు చేశారు? ఇంత తతంగం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదని హైకోర్టు ప్రశ్నిస్తూ జీవీఎంసీకి నోటీసులు జారీ చేసింది. రెండు నెలలు గడిచినా వాటిని తొలగించకపోవడంతో బొలిశెట్టి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. కార్పొరేషన్‌ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీతో పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జోన్‌–2 కమిషనర్‌ నల్లనయ్య, అక్కినేని కళాసాగర్‌ అధ్యక్షుడు పొన్నాడ మోహనరావులకు నోటీసులు జారీ చేసింది. వీరిని ప్రతివాదులుగా చేర్చుతూ వాదనలు వినిపించేందుకు రెండు వారాల గడువు విధించింది. వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. అయినా.. స్పందన లేకపోవడంతో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

నోటీసుల జారీతో కదలిక
కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ కావడంతో జోన్‌–2 టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఉలిక్కిపడ్డారు. విగ్రహాల వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళనతో వాటిని తొలగించేందుకు సిద్ధపడ్డారు. పగటి పూట అయితే అవాంతరాలు ఎదురవుతాయని, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సోమవారం అర్థరాత్రి పోలీస్‌ బందోబస్తు నడుమ విగ్రహాల్ని తొలగించేశారు.

దిమ్మలను జేసీబీలతో తొలగిస్తున్న సిబ్బంది
కేసు పెండింగ్‌లో ఉంది
మరోవైపు ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. గత నెలలో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ కావడంతో విగ్రహాల తొలగింపునకు జీవీఎంసీ సిద్ధమైంది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ముందుగానే మేల్కొన్న జీవీఎంసీ అధికారులు విగ్రహాల్ని తొలగించేశారు. ఇన్ని రోజులూ దీనిపై స్పందించని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు రాత్రికి రాత్రే ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే ఈ వ్యవహారం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు. కాగా విగ్రహాలను హఠాత్తుగా రాత్రికి రాత్రి తొలగించడంపై  జోన్‌–2 ఏసీపీ నాయుడు సమాధానం దాటవేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న కారణంగా.. విషయాలు చెప్పకూడదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు