‘దమ్ముంటే కర్నూలులో హైకోర్టు వద్దని చెప్పగలరా’

3 Jan, 2020 19:53 IST|Sakshi

సాక్షి, కర్నూలు : గత అయిదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు పాలన గ్రాఫిక్స్‌కే పరిమితం చేశారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏర్పాటు చేయకుండా తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. విజన్ 2020లో చంద్రబాబుకు మిగిలేది 20 మంది ఎమ్మెల్యేలేనని ఎద్దేవా చేశారు. రాజధాని భూములలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని పురుద్ఘాటించారు. ప్రజల ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కట్టుబడి వున్నారని, అమరావతిలో భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తెచ్చేందుకు సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. (‘ఇన్నేళ్లు అద్దె రాజధానిలో ప్రజలు గడిపారు’) 

కర్నూలుకు రావాల్సిన రాజధానిని తాము కోల్పోయామని, తమకు ఎవరూ మేలు చేయలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు అభివృద్ధి కోసం న్యాయవాదులు కష్టపడ్డారని, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ) నివేదికను స్వాగతిస్తున్నామన్నారు. గత టీడీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. మూడు రాజధానులపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, వారికి దమ్ముంటే కర్నూలులో హైకోర్టు వద్దని చెప్పగలరా అని ప్రశ్నించారు.  బీసీజీ కమిటీ అనేక సర్వేలు చేసిందని,  ఈ కమిటీ ద్వారా కర్నూలుకు న్యాయం జరుగుతుందని హఫీజ్‌ ఖాన్‌ పేర్కొన్నారు. 

చదవండి: ఏపీ రాజధానిపై నివేదిక అందించిన బీసీజీ

మరిన్ని వార్తలు