అవసరం కొండంత..ఇచ్చింది గోరంత

16 Mar, 2017 12:29 IST|Sakshi
అవసరం కొండంత..ఇచ్చింది గోరంత

► జిల్లాపై బాబు శీతకన్ను
► బడ్జెట్‌లో వెలిగొండకు కేటాయించింది రూ.200 కోట్లే
► ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం
► కొరిశపాడు లిఫ్ట్‌కు ఇచ్చింది రూ.7.45 కోట్లు
► పాలేరు రిజర్వాయర్‌కు రూ.3.98 కోట్లు
► రాళ్లపాడుకు రూ.1.28 కోట్లు
► ఊసే లేని రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం


ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కో హామీని గాలికొదిలేసింది. ఆది నుంచి జిల్లా అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. తాజా బడ్జెట్‌లోనూ మొండిచేయి చూపింది. పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టగా..జిల్లా అభివృద్ధికి కీలకమైన పోర్టు, విమానాశ్రయం, పారిశ్రామికవాడల ఊసే ఎత్తలేదు. సంక్షేమ పథకాల అమలుకూ మొక్కుబడిగా నిధులిచ్చి చేతులు దులుపుకున్నారు. బడ్జెట్‌లో జిల్లాను చిన్నచూపు చూడటంపై జనం మండిపడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు 2017–18 బడ్జెట్‌లో బాబు సర్కారు మొండిచేయి చూపింది. జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామంటూనే సర్కారు వంచనకు పాల్పడింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.2,800 కోట్లు అవసరం కాగా, బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన  బడ్జెట్‌లో రూ.200 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టే పరిస్థితి నెలకొంది. రూ.1,56,980 కోట్ల బడ్జెట్‌ అంటూ ఘనంగా చెప్పుకున్న బాబు సర్కారు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూసింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు అరకొర నిధులు విదల్చగా ఇక జిల్లాకు ఇచ్చిన ప్రధాన హామీలు రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం, మైనింగ్‌ యూనివర్సిటీ, కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ మొదలుకొని ఏ ఒక్క హామీని బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.

వెలిగొండకు చిల్లర విదిలింపు: తాజా అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం. కనీసం ఫేజ్‌–1 పరిధిలోని టన్నెల్‌–1, హెడ్‌రెగ్యులేటర్‌ కాలువ పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకే వెయ్యి కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతా క్రమంలో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించినా... బడ్జెట్‌ కేటాయింపులకు వచ్చేసరికి మొక్కుబడి నిధులతో సరిపెట్టారు. ఇప్పటికే పాత బకాయిలు రూ.50 కోట్లు ఉన్నాయి. వాటికి పోను కేటాయింపులు చూస్తే కేవలం రూ.150 కోట్లు ఇచ్చినట్లు. జిల్లాలోని కరువును పారదోలటంతో పాటు ఫ్లోరైడ్‌ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యం. జిల్లా వాసులకు తాగు, సాగునీరుకు ఈ ప్రాజెక్టే ఏకైక ఆధారం. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.40 లక్షల ఎకరాలకు, వందలాది గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాల్సి ఉంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. దాని నిధుల కేటాయింపులు చూస్తే మరో దశాబ్ద కాలానికి కూడా వెలిగొండ పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా అందదు.

మిగిలిన ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులే..: కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.125 కోట్లు అవసరం కాగా బడ్జెట్‌లో రూ.7.45 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పాలేరు రిజర్వాయర్‌ పరిధిలో రూ.50 కోట్లు అవసరం కాగా రూ.3.98 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రాళ్లపాడు స్టేజ్‌–2 పనులకు రూ.1.28 కోట్లు, వీరరాఘవునికోట ప్రాజెక్టుకు రూ.1.8 కోట్లు, కంభం చెరువుకు రూ.28 లక్షలు, పాలేటి బిట్రగుంట పనులకు రూ.45 లక్షలు, ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ డ్రైనేజీ పనులకు రూ.45 లక్షల చొప్పున కేటాయించారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి తాజా బడ్జెట్‌లో రూ.266.73 కోట్లు కేటాయించినట్లు లెక్కల్లో చూపారు. వాస్తవానికి గుండ్లకమ్మ ప్రాజెక్టు వైఎస్‌ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం నిధుల కేటాయింపులు లేవు. పట్టుమని రూ.20 నుంచి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తే పనులు పూర్తయ్యేవి. అయితే చంద్రబాబు సర్కారు వచ్చాక బడ్జెట్‌ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లలోపు నిధులు అయితే సరిపోతాయని అధికారులు తాజా అంచనాలు ప్రభుత్వానికి పంపారు. విచిత్రమేమిటంటే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.266.73 కోట్లు కేటాయించటం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున దోచుకునేందుకే అంచనాలను భారీగా పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగార్జున సాగర్‌ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.103.56 కోట్లు కేటాయించారు. మొత్తంగా జిల్లాలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు చంద్రబాబు సర్కారు నిధుల కేటాయింపుల్లో మొండిచేయి చూపిందని చెప్పాలి.

పోర్టు..పారిశ్రామిక కారిడార్‌ల ఊసేదీ..: బడ్జెట్‌లో రామాయపట్నం ఊసే లేదు. దొనకొండ ఇండస్ట్రియల్‌ కారిడార్, కనిగిరి నిమ్జ్‌లను ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. విమానాశ్రయం సంగతి మరిచారు. నిరుద్యోగ భృతికి కేవలం రూ.500 కోట్లను కేటాయించటం చూస్తే బాబు సర్కారు చిత్తశుద్ధి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఆరోగ్యశ్రీని ఎన్‌టీఆర్‌ వైద్యసేవగా మార్చినా మొత్తం బడ్జెట్‌లో వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిలే జిల్లా స్థాయిలో రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. ఇక డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి, రైతు రుణమాఫీలకు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లకుపైగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని బాబు సర్కారు గతంలో పలుమార్లు చెప్పినా బడ్జెట్‌లో మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. ఇక పేదలకు అడిగినన్ని గృహాలు కట్టిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చినా అవేమీ నెరవేరలేదు. తాజాగా లక్షల గృహాలు నిర్మిస్తామంటూ బాబు సర్కారు ప్రకటించిన ఆ స్థాయిలో నిధుల కేటాయింపుల్లేకపోవడం గమనార్హం. మొత్తంగా 2017–18 బాబు బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు