సబ్సిడీ.. సగం కోత

11 Jul, 2014 02:20 IST|Sakshi
సబ్సిడీ.. సగం కోత

రైతు సంక్షేమమే మా లక్ష్యమని గొప్పలు చెప్పిన పాలకులు ఇప్పుడు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో రైతులకు బిందు సేద్యం పరికరాలు 90 శాతం సబ్సిడీతో అందిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రాయితీలో కోత విధించింది. అసలే కరువు కాటకాలతో అల్లాడుతూ కష్టాలు.. కన్నీళ్లను దిగమింగుకుని బతుకు వెల్లదీస్తున్న తమ పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     
 
 కడప అగ్రికల్చర్: రైతులేనిదే రాజ్యం లేదని, రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఎన్నికల సమయంలో అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు అదరగొట్టారు. తీరా అధికార పగ్గాలు చేపట్టగానే రైతుల నడ్డివిరిచే చర్యలకు పూనుకుంటున్నారు. కరువుతో అల్లాడుతూ బిందు సేద్యంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు అశనిపాతంలా తగిలాయి.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కరువు పీడిత, కరువులేని మండలాలను గ్రూపులుగా విడదీశాయి. ఇందులో కరువు పీడిత ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం, మిగిలిన వారికి 35 శాతం బిందు సేద్యం పరికరాలపై సబ్సిడీ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా 10 శాతం కలిపి అందించాలని కేంద్రం ఆదేశించింది.
 
 అలాగే కరువులేని ప్రాంతాల్లో  చిన్నకారు రైతులకు 35 శాతం, మిగిలిన రైతులకు 25 శాతం సబ్సిడీని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం వల్ల ప్రధానంగా ఉద్యాన రైతులపై పెనుభారం పడుతుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. బిందు, తుంపర సేద్య పరికరాలపై అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత విధించడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు.
 
 జిల్లాలోని పులివెందుల, పెండ్లిమర్రి, తొండూరు, సింహాద్రిపురం, లింగాల, చింతకొమ్మదిన్నె, వీరపునాయునిపల్లె, ముద్దనూరు, కొండాపురం, వేంపల్లె, వేముల, బి.మఠం, రామాపురం, రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లి, టి. సుండుపల్లి, వీరబల్లి, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని చాలా మంది రైతులు బిందు, తుంపర సేధ్యంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. బిందు, తుంపర సేద్య పరికరాలపై సబ్సిడీలు తగ్గించారని తెలియడంతో ఆయా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
 
 ఓవైపు వరుస కరువు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలను తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఉన్నట్లుండి సబ్సిడీల్లో కోతలు విధించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతంలో కేంద్ర ప్రభుత్వంపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చి 70 శాతం సబ్సిడీ ఉన్న బిందు, తుంపర సేద్య వ్యవసాయాన్ని రాష్ట్రంలోని రైతులకు మరింత చేరువ చేసేందుకు 90 శాతం సబ్సిడీకి పెంచేలా చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకైతే పూర్తి సబ్సిడీ అందించి ఆదుకున్నారు.  
 
 ఉద్యాన పంటలకు
 బిందు సేద్యంతో మెలిక
 ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ముందుగా బిందు సేద్యాన్ని పొందిన తర్వాతనే ఉద్యాన పంటలు సాగు చేయాలనే నిబంధన పెట్టారు. గతంలో ఉద్యాన పంటలు సాగు చేసుకున్న తర్వాత బిందు సేద్యాన్ని రైతులు ఏర్పాటు చేసుకునే వారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలని అధికారులకు దరఖాస్తు చేసుకుంటారో ఆ రైతులు ముందుగా బిందు సేద్య యూనిట్లను పొలంలో ఏర్పాటు చేసుకున్నారా? లేదా? అని పరిశీలించి ఆ తర్వాత ఉద్యాన పంటల సాగుకు అనుమతులు ఇవ్వాలనే నిబంధన విధించారు. దీంతో రైతులు ఇబ్బందులు పడక తప్పదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజించిన మండలాల వివరాలు
 కరువు పీడిత మండలాలు
 కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, చక్రాయపేట, గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, వీరబల్లి, టి.సుండుపల్లె, సంబేపల్లె, రాయచోటి, చిన్నమండెం, గోపవరం, బి.మఠం, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, కాశినాయన, జమ్మలమడుగు, పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, పులివెందుల, సింహాద్రిపురం, వేముల, లింగాల, తొండూరు, వేంపల్లె.
 
 కరువు లేని మండలాలు
 అట్లూరు, చింతకొమ్మదిన్నె, చాపాడు, చెన్నూరు, చిట్వేలి, దువ్వూరు, ఖాజీపేట, రైల్వేకోడూరు, మైదుకూరు, నందలూరు, ఓబులవారిపల్లె, పెనగలూరు,పెండ్లిమర్రి, ప్రొద్దుటూరు, పుల్లంపేట, రాజంపేట, సిద్దవటం, వల్లూరు, ఒంటిమిట్ట, కడప.
 

మరిన్ని వార్తలు