‘దొంగనోట్ల’ కేసు సీబీసీఐడీకి అప్పగించాలి

30 Jul, 2013 04:50 IST|Sakshi

ధర్మవరం, న్యూస్‌లైన్: పట్టణంలో దొంగనోట్ల చలామణి వ్యవహారంపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని వైఎస్‌ఆర్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పట్టణంలోని సానే నరసింహారెడ్డి మిషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు మూడేళ్లుగా ధర్మవరం కేంద్రంగా దొంగనోట్ల చెలామణి జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉండడంతో ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు వెల్లడి కాలేదన్నారు.

పట్టుచీరల తయారీ, విక్రయాలకు ప్రసిద్ధి చెందిన పట్టణంలోని వేలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారుల కష్టానికి ప్రతిఫలంగా దొంగనోట్లు ఇచ్చి వారి జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. బాధ్యత గల పౌరులందరూ దొంగనోట్ల చలామణిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేయాలన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, డీఎస్పీ పాత్రపై ఉన్నత స్థాయి అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని, వాటిలో ఎన్ని దొంగనోట్లు ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. బాధ్యతాయుతమైన పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులపైనే ఆరోపణలు రావడం శోచనీయమన్నారు. వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పెద్దలతో చర్చించి ఈ బండారం బయటపడేంత వరకు ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి మండల కన్వీనర్ బగ్గిరి బయపురెడ్డి, సానే నరసింహారెడ్డి, జొన్నలకొత్తపల్లి నారాయణరెడ్డి, వెంకటరమణరాజు, లింగారెడ్డి, కోళ్లమొరం శంకరరెడ్డి, తాడిమర్రి తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు