కనికరించరేమయ్యా!

21 Aug, 2018 10:16 IST|Sakshi
ఒకరికి..ఒకరు

ఈ ఫొటోలోని ఇద్దరూ దివ్యాంగులు. ఒకరు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చెన్నమ్మ కాగా మరొకరు పెళ్లకూరు మండలం శిరసనంబేడుకు చెందిన ఇందిరాకుమారి. ఇద్దరికీ రెండు కాళ్లూ పనిచేయవు. గత కొన్నేళ్లుగా సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెన్నమ్మ ట్రై సైకిల్‌ తుప్పు పట్టిపోయింది. కొత్త సైకిల్‌ కోసం అధికారులను ప్రాథేయపడుతోంది. ఇందిరాకుమారి రుణం కోసం అర్థిస్తోంది. ఎన్నిసార్లు కలెక్టరేట్‌ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం కూడా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌డేకు తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చారు. చెన్నమ్మ తుప్పుపట్టిన ట్రైసైకిల్‌పైనే కలెక్టరేట్‌కు వచ్చింది. అది ముందుకు కదలక మొరాయించింది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు.

ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు. అటూ.. ఇటూ తిరుగుతున్న కలెక్టరేట్‌ సిబ్బందికి ఆమె అవస్థ పట్టలేదు. పక్కనే ఉన్న ఇందిరాకుమారి, చెన్నమ్మ కష్టాన్ని చూసింది. పాకుకుంటూ వెళ్లింది. నీకు నేనున్నానంటూ ట్రైసైకిల్‌ చక్రాన్ని సరిచేసి సాయం అందించింది. ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకుసాగుతున్న వీరి కష్టాలు మాత్రం అధికారులకు కనిపించడం లేదు. ఎప్పటిలాగే వీరు అధికారులను కలిశారు. వినతిపత్రాలు ఇచ్చారు.  మా సమస్య ఎప్పటికి తీరుతుందోనంటూ వారు వెనుదిరిగారు. 
ఫొటో– వి.సాంబశివరావు, నెల్లూరు (పొగతోట)

నెల్లూరు(పొగతోట): సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ గోడు అధికారుల ఎదుట వెళ్లబోసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్‌ భార్గవి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

నీటి ప్రవాహాన్ని పెంచండి 
పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్‌ నుంచి నెల్లూరు జిల్లాకు నీటిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కృష్ణానదికి వరద అధికంగా వస్తోందని, ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వాటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా జిల్లాలోకురవడం లేదన్నారు.కరువుతో ప్రజలు అలమటిస్తున్నారని,  పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్‌ నుంచి నీటి ప్రవాహాన్ని పెంచి జిల్లాలోని చెరువులను నీటితో నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

న్యాయ విచారణ జరిపించాలి 
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయడం లేదు. మండలానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేసే జేసీబీలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్లు పెద్ద పెద్ద భూస్వాములకు అందజేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇచ్చారు. గత మూడేళ్ల నుంచి గిరిజనులకు రుణాలు కూడా మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీల దారదత్తంపై న్యాయ విచారణ జరిపించాలి. గ్రామానికి 10 నుంచి 20 మందికి రుణాలు మంజూరు చేయకపోతే ఈ నెల 22 నుంచి జిల్లావ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం. – ఎస్‌.మల్లి తదితరులు, దళిత సంఘర్షణ సమితిజిల్లా అధ్యక్షుడు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా