సెల్ఫీ కలకలం

6 Aug, 2018 06:58 IST|Sakshi
ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు గొర్రెల శివరావు

రుణం అడ్డుకుంటున్నారని ఆరోపణ

ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో

దివ్యాంగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పశ్చిమగోదావరి, ఉండ్రాజవరం: రాష్ట్రంలో జన్మభూమి కమిటీల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తమకు అనుకూలంగా ఉన్నవారికి ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చడం, వ్యతిరేకంగా ఉన్నవారిపై కక్ష కట్ట డం గ్రామాల్లో పరిపాటిగా మారిపోయింది. జన్మభూమి క మిటీ సభ్యుల కక్ష సాధింపులతో ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకునేందుకు పూనుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ గ్రామంలో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిపోయిందని, తనకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారంటూ ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్‌ చేయడం సంచలనం కలిగించింది.

వివరాలిలా ఉన్నాయి.. ఉండ్రాజవరం మండలం వడ్లూరుకు చెందిన గొర్రెల శివరావు దివ్యాంగుడు. 2014లో జన్మభూమి గ్రామసభలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెల రోజుల తర్వాత గృహ నిర్మాణశాఖ అధికారులు ఇల్లు మంజూరైందని చెప్పడంతో అప్పు చేసి నిర్మాణం పూర్తిచేశాడు. అప్పటి నుంచి బిల్లుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా  మంజూరు చేయడం లేదు. దీంతోతీవ్ర మనస్తాపం చెందిన శివరావు శనివారం సాయంత్రం ఉండ్రాజవరంలో గృహ నిర్మాణశాఖ కార్యాలయానికి వెళ్లి ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు ఇంటికి సంబంధించిన మంజూరు ఉత్తర్వులు, బిల్లులు ఇవ్వకపోతే పెట్రోల్‌ పోసుకుని ఇక్కడే ఆత్మహత్య చేసుకుం టానని సెల్ఫీ వీడియో దిగి వాట్సాప్‌లో పోస్ట్‌ చేశాడు. గ్రామానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు తనకు ఇల్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. తాను ఇంటి కోసం 1100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో కక్ష కట్టారని వాపోయాడు. బీసీ కార్పొరేషన్‌ రుణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు. సెల్ఫీ విషయం తెలిసిన గృహ నిర్మాణ శాఖ ఏఈ దండు శివరామరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన వచ్చి బాధితుడు శివరావును ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సంచలనం రేపిన ఆరోపణలు
వాట్సాప్‌ వీడియోలో శివరావు కష్టాలు తెలుసుకున్నవారు అయ్యో పాపం అనగా.. అధికారులు గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. వడ్లూరుకు చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు పంపన అంజి, శ్రీనుబాబు, బుల్లబ్బులు తనకు ఇల్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని శివరావు సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. తాను ఇంటి కోసం 1100కు ఫిర్యాదు చేయగా తనపై కక్ష కట్టారని, బీసీ కార్పొరేషన్‌ రుణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా అడ్డుకున్నారని శివరావు ఆరోపించాడు.

దళిత, బీసీ సంఘాల మద్దతు
శివరావు సెల్ఫీ వీడియో విషయం తెలుసుకున్న దళిత, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. బాధితుడిని పరామర్శిం చి పోలీసులతో చర్చించారు. దీనిపై ఎస్సై గంగాధరరావు మాట్లాడుతూ శివరావు ఆత్మహత్య చేసుకుంటా మంటే అది చట్టరీత్యా నేరమని అందుకే రక్షణ కోసం స్టేషన్‌కు తరలించామని చెప్పారు. సాయంత్రం 7 గంటల వరకు శివరావుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వడ్లూరు గ్రామపెద్దలకు అప్పగించామన్నారు. రాష్ట్ర మాల ఐక్యవేదిక అధ్యక్షుడు తిర్రే రవిదేవా బాధితుడిని పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగుడి పట్ల ఇం త అమానుషంగా వ్యవహరించిన జన్మభూమి కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శివరావు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు