360 గజాల చీర తయారీ

21 Feb, 2018 13:34 IST|Sakshi
బండార్లంకలో తయారీ చేసిన 360 గజాల చేనేత చీరతో సత్యానందం, ఈశ్వరి దంపతులు

అతి పొడుగు పడుగుతో అతిపెద్ద అల్లిక

తూర్పుగోదావరి, అమలాపురం రూరల్‌ : అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను తయారు చేసిన ఘనత మన నేతన్నలదే. ఇప్పుడు మరో రికార్డు నేతన్నలు సృష్టించారు. చేనేత గ్రామమైన బండార్లంకలో 360 గజాల ఎరుపు రంగు చీరను తయారు చేశారు. సాధారణ చేనేత చీర ఆరు నుంచి ఏడు గజాల వరకు తయారు చేస్తారు.అయితే ఈ కార్మికులు ఏకంగా 360 గజాల చీరను తయారు చేసి అబ్బురపరిచారు. ఈ భారీ చీర తయారీలో గ్రామంలోని చేయి తిరిగిన నేతలన్నలు నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు పూర్తి చేశారు. జిల్లాలో చేనేతకు ప్రసిద్ధి చెందిన బండార్లంకలో 360 గజాల చేనేత చీర తయారీకి ఇటీవల శ్రీకారం చుట్టారు. 360 గజాల అతిపెద్ద పడుగుతో పట్టిన అతిపెద్ద అల్లికను చూసేందుకు జనం తరలివచ్చారు.

పసుపు రంగు పడుగుపై కుంకుమ రంగు పెనవేసి పవిత్రంగా ఈ చీరను నేశారు. కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు చింతా శంకరమూర్తి, చేనేత సొసైటీ అధ్యక్షుడు పుత్సల వరద రాజులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు కాపటవీధిలో కొబ్బరికాయ కొట్టి ఈ చీర తయారీని ప్రారంభించారు. అల్లు పనిలో లింగ వయోభేదం లేకుండా కార్మికులందరూ పాల్గొన్నారు. మంగళవారం చీరను ప్రదర్శించారు. మగ్గంపై నెయ్యడానికి 50 రోజులు  సమయం పట్టిందని సత్యనందం తెలిపారు. ఈ చీరను గ్రామదేవత  గంగాదేవి మురుగులమ్మవారికి మార్చి 18న ఉగాది రోజున సమర్పిస్తామని సొసైటీ అధ్యక్షుడు వరదరాజులు చెప్పారు. అనంతరం గ్రామంలోని ముత్తయిదువులు, ఆడపడుచులు, పెద్దలకు చీరలను 60 మందికి పంపిణీ చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచి బడుగు సత్యనారాయణ, చింతపట్ల గంగా సత్యనారాయణ, యాళ్ల సుబ్రహ్మణ్యం, బట్లు బాలకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు