బాబూ.. మాయమాటలు ఇంకెన్నాళ్లు

26 Apr, 2015 02:56 IST|Sakshi

 బుట్టాయగూడెం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయమాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రశ్నించారు. సింగ్‌పూర్ పర్యటనకు వెళ్లి రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తానని, చైనా పర్యటనకు వెళ్లి చైనాలా అభివృద్ధి చేస్తానంటూ చెబుతూ ప్రజలను ముఖ్యమంత్రి మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం బాలరాజు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలన అంతా పర్యటనలకే సరిపోతుందని, కోట్ల రూపాయలు విదేశాల పర్యటనలకే ఖర్చు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అట్టడుగుస్థాయికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి అంటూ నిలువెల్లా మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కొత్త కొలువుల సంగతి అటుంచి ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని బాలరాజు ఆరోపించారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చమని అంగన్‌వాడీలు ధర్నాలు చేస్తుంటే వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఆహార భద్రత పథకం అంటూ ఇప్పుడు కొత్తగా బాబు ఆర్భాటం చేస్తున్నారని, కానీ ఇది గత కేంద్రం ప్రభుత్వం హయాంలోనే వచ్చిన పథకమని తెలిపారు.
 
  దీనికి పసుపురంగు పూసి తన ఘనతగా చెప్పుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలు చేయడంలో విఫలమైన బాబు పాత పథకాలకు పసుపురంగు పూసి కొత్త పథకాలుగా డాబు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర ఖజానాకు విదేశీ పర్యటనలతో మరింత చిల్లు పెడుతున్నారన్నారు. అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు. పార్టీ యువజన నాయకులు వెట్టి మాధవ, పొడియం లక్ష్మణ్, కుమ్మర హరిప్రసాద్, కుంజ ప్రసాద్, కుంజ జగదీశ్ చంద్రబోస్, సవలం కోటేశ్వరరావు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు