రేపు జలజాగరణ

19 Feb, 2016 04:18 IST|Sakshi
రేపు జలజాగరణ

హంద్రీనీవా కోసం వైఎస్సార్ సీపీ నిరసన బాట
చంద్రబాబు కపటనాటకం ఆపాలన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
పట్టిసీమపై ఉన్న చిత్తశుద్ధి హంద్రీనీవాపై లేదని ఆగ్రహం

 
 
 అనంతపురం అగ్రికల్చర్:  హంద్రీనీవా ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలంటూ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసన బాట పట్టారు. ఈ సంవత్సరంలోనే హంద్రీనీవా పూర్తిచేసి 80 వేల ఎకరాలకు నీరివ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో రేపు (శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామం వద్ద రైతులతో కలిసి జలజాగరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లాకు సాగునీరు, తాగునీటి కేటాయింపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కపటనాటకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టుపై ఉన్న చిత్తశుద్ధి జిల్లా వరప్రదాయనిగా భావిస్తున్న హంద్రీ-నీవా సుజల స్రవంతిపై కనబర్చడం లేదని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే హంద్రీ-నీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్నారు.  కళ్లముందే కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నా పొలాలకు మాత్రం నీరు రావడం లేదన్నారు. దీంతో ఏటా రూ. వేల కోట్లు విలువ చేసే పంటలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డిస్ట్రిబ్యూటరీల నుంచి పిల్లకాలువలు, పంట కాలువలు తవ్వితే 33, 34 ప్యాకేజీ కింద వజ్రకరూరు, విడపనకల్, ఉరవకొండ మ ండలాల్లో 40 వేల ఎకరాలకు నీరు అందింవచ్చన్నారు.

అలాగే 36వ ప్యాకేజీలో కాలువ పనులు పూర్తీ చేస్తే బెళుగుప్ప మండలంలో 30 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయవచ్చన్నారు. అదే విధంగా హంద్రీ-నీవా రెండో దశ పూర్తీ చేస్తే కూడేరు మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు నింపవచ్చని చెప్పారు. పట్టసీమ ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో పది శాతం వ్యయం చేసినా ఇవన్నీ పూర్తీ చేయవచ్చన్నారు.  జిల్లాకు నీరివ్వకుండా చిత్తూరు జిల్లా కుప్పంకు నీరు తలరించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. జలజాగరణతో  2016లో బడ్జెట్‌లో హంద్రీ-నీవాకు ప్రాధాన్యత ఇచ్చేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జీబీసీ కాలువ ఆధునీకరణకు వెంటనే నిధులు ఇవ్వాలని, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే తుంగభద్ర ఎగువకాలువ ఆధునీకరణ పూర్తీ చేయాలని, పీఏబీఆర్ నుంచి ఉరవకొండ నియోజక వర్గంలో గ్రామాలకు తాగునీరు అందించే పైప్‌లైన్ యుద్ధప్రాతిపదికన పూర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జలజాగరణ కార్యక్రమానికి అన్ని పార్టీలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మద్ధతు ప్రకటించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నియోజక వర్గ నాయకులు రాధాకృష్ణ, హెచ్.చౌదరి, జి.ఉమాపతి, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు