సాధికార సర్వేపై చేతులెత్తేశారు!

9 Jul, 2016 01:46 IST|Sakshi

90 శాతం పనిచేయని ఆన్‌లైన్ నెట్‌వర్క్
2జీ సిమ్ కార్డులను 3జీకి మార్చని వైనం
వ్యక్తిగత వివరాలు చెప్పడానికి ప్రజల విముఖత
సర్వే తమవల్ల కాదంటున్న ప్రభుత్వ ఉద్యోగులు

 

కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్లు జిల్లాలో ప్రారంభమైన ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే)పై అధికారులు చేతులెత్తేశారు. ప్రజలు వివరాలు చెప్పడానికి విముఖత చూపిస్తున్నారు. అసలు వివరాలను నమోదు చేయడానికి ఆన్‌లైన్ నెట్‌వర్క్ సరిగా రావడంలేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. అంతిమంగా సాధికార సర్వే మూన్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది.

 

చిత్తూరు (అర్బన్): జిల్లాలో మూడు రోజుల క్రితమే సాధికార సర్వే ప్రారంభించారు. రాష్ట్రంలోనే చిత్తూరులోనే సర్వేను తొలిసారిగా ప్రారంభించి రికార్డు సృష్టిస్తే.. అంతే వేగంగా అది తమ వల్ల కాదని అధికారులు, సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ప్రతి కుటుంబంలోని వ్యక్తుల వివరాలను నమోదు చేయడానికి ఈనెలాఖరు వరకు తొలి విడత, వచ్చేనెల 6 నుంచి 15 వరకు రెండో విడతగా సర్వే చేయడానికి తేదీలు ఖరారు చేశారు. అయితే ఆది నుంచీ సర్వేపై సరైన అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వివరాలను నమోదు చేయడానికి 3 వేల మంది సిబ్బందిని నియమించి వారికి ఉన్నతాధికారులు ట్యాబ్‌లు, బయోమెట్రిక్ పరికరాలను అందచేశారు. జిల్లాలోని నివాసాలు, కుటుంబాల సంఖ్య ఆధారంగా 2,745 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో 400 నుంచి 500 కుటుంబాలు ఉంటాయి. అయితే సర్వేకు నియమించిన అధికారులు, సిబ్బందిలో సగం మందికి పైగా ట్యాబ్‌లను ఎలా ఉపయోగించాలో తెలియడంలేదు.

దీనికి తోడు 90 శాతం ట్యాబ్‌లకు గత మూడు రోజుల నుంచి నెట్‌వర్క్ రావడంలేదు. ఇక చిత్తూరు నగరంలో అయితే నిరక్షరాస్యులైన చెత్త ఊడ్చే పారిశుధ్య కార్మికుల చేతికి ట్యాబ్‌లు ఇచ్చి పంపడమే నిదర్శనం. పల్లెల్లో సర్వేకు వెళుతున్న 30 శాతం మంది వీఆర్‌వోలకు ట్యాబ్‌ను ఉపయోగించడం తెలియడంలేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చేయాల్సిన పనులు వదిలేసి ఏజెన్సీల ద్వారా చేయించుకోవాల్సిన సర్వే పనులను తమకు అంటగట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

 
అన్నీ అడ్డకుంలే..

సర్వే సక్రమంగా సాగకపోవడానికి సాంకేతిక కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలోని ప్రతివ్యక్తి ఫోటోను ట్యాబ్‌లో తీసి దాన్ని జియో ట్యాగింగ్ చేయాలి. దీనికి తప్పనిసరిగా 3జీ నెట్‌వర్క్ కావాలి. కానీ 70 శాతం ట్యాబ్‌ల్లో 2జీ నెట్‌వర్క్ ఉండటం వల్ల ఒక్కో కుటుంబానికి గంటల సమయం పడుతోంది. అయినా సరే నెట్‌వర్క్ కనెక్టుకావడంలేదు. 3జీ సిమ్‌కార్డులు అడుగుతుంటే పట్టిం చుకునే దిక్కులేదు. మరోవైపు ప్రజల ఆధార్‌కార్డు, పేర్లు, బ్యాంకు ఖాతాలు అడగడం వరకు బాగానే ఉన్నా.. ఇంట్లో ద్విచక్రవాహ నం, టీవీ, ఫ్రిడ్జ్, కారు, సెల్‌ఫోన్ లాంటి వివరాలను సైతం నమోదు చేయాల్సి ఉండటం తో ప్రజలు ఈ వివరాలను చెప్పడానికి విముఖత చూపిస్తున్నారు. అన్ని వివరాలను చెప్పే స్తే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఎక్కడ తమకు అందవోనంటూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సర్వే చేసే ఎన్యుమరేట ర్లకు శిక్షణ ఇవ్వడం కూడా తూతూ మంత్రం గానే సాగింది. ఎక్కడా ట్యాబ్‌ను అందరి ముందు తెరచి చూపిస్తూ వివరాలను నమో దు చేయడంపై శిక్షణ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఈ అవాంతరాలను అధిగమించి జిల్లాలో సాధికార సర్వే నిర్ణీత గడువులోపు పారదర్శకంగా చేయడం అసాధ్యమని అధికారులు, సిబ్బంది పెదవి విరుస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలచేత చేయించుకోవాల్సిన సర్వేని ఉద్యోగులకు చేత చేయిస్తున్నారంటూ గుర్రుగా ఉన్నారు.

 

మరిన్ని వార్తలు