నా కుటుంబానికి ఆధారం చూపండి

2 Feb, 2019 13:05 IST|Sakshi
జోనల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న దివ్యాంగురాలు

జోనల్‌ కమిషనర్‌ను   వేడుకున్న దివ్యాంగురాలు

పిటిషనర్‌ అదాలత్‌కు    సమస్యల వెల్లువ

కృష్ణాజిల్లా, చిట్టినగర్‌: నడిచేందుకు కాళ్లు లేవు... నా బిడ్డకు భర్త లేడు... పైగా నడుముకు ఆపరేషన్‌ చేయించుకుంది... మనుమడు తెచ్చే సంపాదనతో కుటుంబం నడుస్తోంది...దయచేసి మా కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వాలని వైఎస్సార్‌ కాలనీకి చెందిన  మోతి సుబ్బలక్ష్మీ  సర్కిల్‌–1 జోనల్‌ కమిషనర్‌ భవానీప్రసాద్‌ను వేడుకున్నారు. సర్కిల్‌–1 కార్యాలయంలో శుక్రవారం పిటిషనర్‌ అదాలత్‌ నిర్వహించారు. జోనల్‌ కమిషనర్‌ భవానీ ప్రసాద్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కేఎల్‌రావునగర్‌ 7వ లైన్‌లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానిక యువకుడు  భవానీ ప్రసాద్‌కు వినతిపత్రం అందచేశారు. ఇక  చెరువు సెంటర్‌లోని చిన్న సాయిబాబా గుడి వద్ద డ్రెయిన్‌ ధ్వంసం కావడంతో మురుగునీరు పారడం లేదని, దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని సమస్యను వివరించారు. గత వారం కూడా అదాలత్‌లో  ఇదే సమస్యను విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.

36వ డివిజన్‌ వించిపేట ఇస్మాయిల్‌ వీధి అభివృద్ధికి గత ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఇంతవరకు రోడ్డు నిర్మాణం జరగలేదని  కార్పొరేటర్‌ బీ జాన్‌బీ జోనల్‌ కమిషనర్‌కు వివరించారు. దీనిపై ఈఈ వివరణ ఇవ్వాలని కోరగా... వారం రోజులలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకుంటే స్థానికులు రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేస్తామని చెబుతున్నారని వివరించారు.  39వ డివిజన్‌లో నివాసం ఉండే వారికి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని స్థానికంగా ఉండే కొనకళ్ల రామాంజనేయులు భవానీ ప్రసాద్‌ను ప్రశ్నించారు. తన కంటే వెనుక దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వ గృహాలు మంజూరయ్యాయని, తనకు మాత్రం కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. అదాలత్‌లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు