హంద్రీనీవా.. వాస్తవం కనవా!

14 Mar, 2018 10:02 IST|Sakshi
రాచేపల్లి వద్ద రైల్వేట్రాక్‌ వద్ద సాగుతున్న మోటార్ల ఏర్పాటు పనులు

లేపాక్షి ఉత్సవాల నాటికి నీరిస్తామని ప్రగాల్బాలు

అసంపూర్తి పనులతో హడావుడి

అడ్డంకులు తొలగించకుండా నీటి విడుదలకు సన్నాహాలు

రాచేపల్లి, దేమకేతేపల్లి వద్ద నిలిచిన కాలువ తవ్వకం

రెండోదశ పనుల్లో ఆయకట్టు, చెరువుల కుదింపు

చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో చెరువులకు ఎగనామం

హంద్రీనీవా నీటితో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.     అసంపూర్తి పనులతో ప్రజలను మభ్యపెడుతోంది. ఇంతకాలం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. ఇప్పుడేమో లేపాక్షి ఉత్సవాల నాటికి నీరంటూ నమ్మబలుకుతోంది. వాస్తవ పరిస్థితి చూస్తే అడుగడుగునా అవాంతరాలే. పది రోజుల్లో అన్నింటినీ అధిగమిస్తే తప్ప లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఇంత చేసినా.. చెరువులకు నీరివ్వడం కష్టమే.

మొదటి, రెండోదశ పనులు పూర్తి చేసి 2015 నాటికే 7లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం.
2014 సెప్టెంబర్‌లో అనంతపురంలో జల వనరుల     శాఖమంత్రి ఉమామహేశ్వరావు ప్రకటన
మూడు నెలల్లో ప్రాజెక్ట్‌ పూర్తి చేసి ప్రతి చెరువునూ నీటితో నింపుతాం.
2015 ఫిబ్రవరిలో గవర్నర్‌ నరసింహన్‌ సాక్షిగా ముఖ్యమంత్రి హామీ
2016 డిసెంబర్‌లో గొల్లపల్లి రిజర్వాయర్‌ వద్ద నీటిని విడుదల చేశారు. నేటికి 15 నెలలు కావస్తున్నా హిందూపురానికి చుక్క నీరు చేరలేదు. ఇక మడకశిర ప్రాంతానికి నీరు చేరడమూ అనుమానమే.

హిందూపురం అర్బన్‌ : కరువు జిల్లాను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేసేందుకు 40 టీఎంసీల సామర్థ్యంతో 1988లో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 1994లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను సాగునీటి నుంచి తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చి ఐదు టీఎంసీల సామర్థ్యానికి కుదించారు. దీనిపై అప్పట్లో ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టడంతో పది టీఎంసీలకు మార్పు చేశారు. ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు హంద్రీనీవా పనులను మాత్రం పూర్తి చేయలేకపోయారు. 2004లో అధికారంలోకి వచ్చిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం.. హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయిలో జీవం పోసింది. 40 టీఎంసీల సామర్థ్యాన్ని పునరుద్ధరించడంతో పాటు రాయలసీమ మొత్తంగా 6.02లక్షల ఎకరాల ఆయకట్టును వైఎస్సార్‌ ప్రకటించారు. ఇందులో అనంత జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. జీడిపల్లి వరకు చేరిన కృష్ణా జలాలను పెనుకొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా మడకశిర సబ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి హిందూపురం, మడకశిర ప్రాంతాలకు సాగునీరు ఇచ్చేందుకు పనులు ప్రారంభించారు. దాదాపు 85 శాతం పనులను వైఎస్సార్‌ పూర్తి చేశారు. 2014 వరకు గొల్లపల్లి రిజర్వాయర్‌ ద్వారా 52 నుంచి 58వ ప్యాకేజీల్లో మడకశిర ప్రాంతం వరకు సుమారు 65 శాతం పనులు పూర్తయ్యాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 35 శాతం పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.

ఆయకట్టు కుదింపు
మడకశిర బ్రాంచ్‌కెనాల్‌ ద్వారా పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, లేపాక్షి, హిందూపురం, పరిగి, మడకశిర, గుడిబండ, రొళ్ల, ఆగళి, అమరాపురం మండలాలకు నీరు అందించేలా ఈ ప్రాజెక్టులో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు పెనుకొండ మండలంలో 6,113 ఎకరాలు, రొద్దం మండలంలో 8,528 ఎకరాలు సోమందేపల్లి మండలంలో 18.344 ఎకరాలు, హిందూపురం 10.665 ఎకరాలు, లేపాక్షి మండలంలో 9,171 ఎకరాలు, పరిగి 6,971 ఎకరాలు, మడకశిర ప్రాంతంలో 18,108 ఎకరాల చొప్పున మొత్తం 77,900 ఎకరాలకు ఆయకట్టు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రణాళికలు మార్చేసి 32.227 ఎకరాలకు కుదించారు.

చెరువుల సంఖ్య తగ్గింపు
మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా పెనుకొండలో ఐదు చెరువులు, రొద్దంలో రెండు, గోరంట్ల మండలంలో 136, చిలమత్తూరు మండలంలో 28 చెరువులకు నీరు ఇచ్చేలా ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పెనుకొండ, రొద్దం మండలాలకు మినహా మిగిలిన మండలాల చెరువులకు ఎగనామం పెట్టారు. పెనుకొండ మండలంలోనే గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మించినప్పటికీ అక్కడ కేవలం కోనాపురం, మావటూరు, రేగడ, అడదాకులపల్లి, నాగలూరు చెరువులను మాత్రమే జాబితాలో చూపుతున్నారు. అయితే గొల్లపల్లి రిజర్వాయర్‌ కింద 10వేల ఆయకట్టును ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఒప్పందం ఏమైంది ఎవరూ చెప్పడం లేదు. రొద్దం మండలంలో తొలుత 8,528 ఎకరాల ఆయకట్టు ప్రకటించారు. అయితే తురకలాపట్నం, సానిపల్లి చెరువుల ఆయకట్టును మాత్రమే చూపుతూ.. మిగిలిన ఆయకట్టును ఎగ్గొట్టారు. నీటిని మొత్తం కియా కంపెనీకి నీరిచ్చే యోచనతోనే సంఖ్య కుదించినట్లు తెలుస్తోంది.

పనులన్నీ అసంపూర్తి..
చాకర్లపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద బాక్స్‌పుషింగ్‌ పనుల వద్ద సిమెంట్‌ ఫ్లోరింగ్‌ పనులు పూర్తి కాలేదు. లిఫ్టింగ్‌ మోటర్ల ఏర్పాటు పూర్తి స్థాయిలో కాలేదు. ఆరు పంపింగ్‌ మోటర్లకు గాను కేవలం ఒకట్రెండుతో సరిపెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమందేపల్లి రోడ్డు బ్రిడ్జి వద్ద కాలవ మట్టిగోడల నిర్మాణాలు పూర్తి కాలేదు. న్యాయమైన పరిహారం ఇవ్వకపోవడంతో రాచేపల్లి వద్ద మూడు ఎకరాల్లో కాలువ తవ్వకం పనులను రైతులు అడ్డుకున్నారు. కాలువ తవ్వే ప్రాంతంలో అటువైపు ఉన్న పొలాలకు రైతులు వెళ్లేందుకు అనువుగా వంతెన నిర్మాణాలు పూర్తి చేయలేదు. దేమకేతపల్లి వద్ద రెండు ఎకరాల పరిహారం కోసం రైతు కోర్టును ఆశ్రయించడంతో అక్కడ పనులు ఆగిపోయాయి. కిరికెర నుంచి మడకశిర వరకు 56, 58 ప్యాకేజీల పనులు ఇంకా పూర్తికాలేదు. పెన్న, జయమంగళీ నదుల్లో పైపులైన్లు వేయాల్సి ఉంది. అప్పలకుంట వద్ద కొంత భూమి సేకరణ చేయాల్సి ఉంది. అవాంతరలన్నీ పది రోజుల్లో తొలగిపోతే తప్ప లేపాక్షికి హంద్రీ–నీవా నీరు చేరే పరిస్థితి లేదు. ఒకవేళ ఇవన్నీ పూర్తి చేసినా.. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి లేపాక్షి వరకు మధ్యలో ఉన్న దాదాపు 35 చెరువులకు నీరు చేరే పరిస్థితి లేదు.

మరిన్ని వార్తలు