హనుమాన్ జంక్షన్ లేదా సాగర్!

13 Mar, 2014 01:51 IST|Sakshi
హనుమాన్ జంక్షన్ లేదా సాగర్!

సీమాంధ్ర రాజధానికి అనువైన ప్రాంతాలు
పురపాలక శాఖ నివేదిక  
కొత్త రాజధాని మౌలిక సదుపాయాల కమిటీకి ప్రజెంటేషన్  

 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర రాజధానిగా కృష్ణా జిల్లాలోని హనుమాన్‌జంక్షన్ లేదా గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతాలు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని పురపాలక శాఖ వ్యక్తం చేస్తోంది. రవాణా, సమాచార వ్యవస్థ, ప్రభుత్వ భూములు, విమానాశ్రయం, తాగునీటి సౌకర్యం అన్నీ కలగలిసిన ప్రాంతం.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు వరకూ గల ప్రాంతం.. అలాగే గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ తీరం.. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని పురపాలక శాఖలోని డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికార యంత్రాంగం రూపొందించిన నివేదిక సూచిస్తోంది.
 
  కర్నూలు, దొనకొండ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి పలు సమస్యలు ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. కొత్త రాజధానికి సంబంధించి వినిపిస్తున్న పలు ప్రాంతాల గురించి అధికారులు అధ్యయనం చేశారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి నేతృత్వంలో కొత్త రాజధాని మౌలిక సదుపాయాల అంశంపై ఏర్పాటైన కమిటీకి డీటీసీపీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో ప్రాంతం గురించి అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్‌లోని ముఖ్యాంశాలు...
 
 కర్నూలు
 -    శ్రీశెలం డ్యామ్ బ్యాక్‌వాటర్ వల్ల, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం.
 -    తాగునీటికి సమస్య ఉంటుంది. సరైన సమాచార, రవాణా వ్యవస్థ లేదు.
 దొనకొండ
 - ప్రకాశం జిల్లాలోని దొనకొండ పరిసరాల్లో ఎర్రబాలెం, గంగదొనకొండ, వబ్బాపురం, పశ్చిమ గంగవరం, అబ్బయ్యపాలెంలను కొత్త రాజధానిలో చేర్చవచ్చు.  మూసివేసిన రన్‌వే, విమానాశ్రయం ఉంది.
 - ఈ ప్రాంతానికి సరైన రవాణా, సమాచార వ్యవస్థ లేదు.  ప్రస్తుత సమాచారం ప్రకారం తాగునీటి సమస్య కూడా ఉంది.  ఈ ప్రాంతంలో ప్రతికూల అంశాల వల్ల రాజధానికి పనికిరాదు.
 
 గుంటూరు
 - గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ సరిహద్దులోని ప్రాంతం అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది.
 - దీని చుట్టూరా మాచర్ల, కొత్తపల్లి, చింతాల తండ, రాయవరం, రాచమల్లిపాడు, కంభంపాడు, తదితర ప్రాంతాలను రాజధానిలో చేర్చవచ్చు.
 - మూతపడిన రన్‌వే, పురాతన విమానాశ్రయం మంచి కండిషన్‌లో ఉంది.
 - ఈ ప్రాంతానికి సరైన రవాణా, సమాచార వ్యవస్థ సదుపాయం ఉంది.
 - నగర పెరుగుదలకు అవసరమైన తాగునీటి లభ్యత కూడా ఉంది.
 - వాతావరణ పరిస్థితులు, రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్ల రాజధానికి ఉత్తమైన  ప్రాంతం.
 
 హనుమాన్ జంక్షన్ - ఏలూరు రోడ్డు
 - కృష్ణా జిల్లాలోని ఈ ప్రాంతంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు పెద్ద పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి.
 - ఈ ప్రాంత సరిహద్దుల్లో నూజివీడు, కొత్తపల్లి, బిల్లనపల్లి, వేంపాడు, కొక్కిరపాడు, పల్లెర్లమూడి, సీతారామాపురం తదితర ప్రాంతాలను కొత్త రాజధానిలో చేర్చవచ్చు.
 - గన్నవరం విమానాశ్రయం ఈ ప్రాంతానికి 20, 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీనిని రాజధాని విమానాశ్రయంగా వినియోగించవచ్చు.
 - ఈ ప్రాంతం మంచి రైల్వే, రోడ్డు, రవాణా సౌకర్యాలతోపాటు సమాచార వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంది.
 - రాజధాని నగరానికి అవసరమైన నీటి లభ్యత కూడా ఉంది. పోలవరం కాలువతో నీటి సౌకర్యం కల్పించవచ్చు.
 - ఈ ప్రాంతం రాజధాని కోసం స్థల, వాతావరణ పరంగా ఉత్తమమైన ప్రాంతం.

మరిన్ని వార్తలు