ఆ ఇల్లే ..రంగస్థలం

10 Oct, 2018 14:34 IST|Sakshi
సత్యహరిశ్చంద్రుడి పాత్రలో మెప్పిస్తున్న డీవీ వంశస్తులు

మూడు తరాలుగా ఒకటే ‘వేషం’

సత్యహరిశ్చంద్రుడి పాత్రలో మెప్పిస్తున్న డీవీ వంశస్తులు

భారతదేశ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు

దేవీ...! కష్టములెట్లున్నను పుణ్య క్షేత్రమైన వారణాసిని దర్శించితిమి చూడు..,రాజే కింకరుడగున్‌–కింకరుడే రాజగున్‌ కాలానుకూలంబుగా.., ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే..,మహాకవి గుఱజాషువా,బలిజేపల్లి లక్ష్మీకాంతం కవుల కలాల నుంచి జాలువారిన మహాకావ్యంసత్య హరిశ్చంద్ర నాటకంలోని జనాదరణ పొందిన పద్యాలివి.

ప్రకాశం : సత్యహరిశ్చంద్ర వేషంలో ఆయన స్టేజి ఎక్కి  పద్యం అందుకుంటే చాలు ప్రేక్షకులు ఒళ్లంతా చెవులు చేసుకుని వినేవారు. వన్స్‌మోర్‌ అంటూ మళ్లీ మళ్లీ పాడించుకునే వారు. సత్యహరిశ్చంద్ర పాత్రలో అంతగా ఒదిగిపోయినఆ రంగస్థల దిగ్గజమే వేటపాలేనికి చెందిన దుబ్బు వెంకట సుబ్బారావు. ఈయనను ప్రేక్షకులు ముద్దుగా డీవీ అని పిలుస్తుంటారు. తన గాత్రం, అభినయంతో ఎందరో కళాభిమానుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. జీవితాంతం హరిశ్చంద్ర వేషం వేస్తూ హరిశ్చంద్ర అంటే డీవీ అన్న పేరు పొందారు. ఆయన తదనంతరం కుమారుడు, ఆ తర్వాత మనవడు కూడా ఇదే పాత్రను పోషిస్తూ కళా రంగంలో రాణిస్తున్నారు. జూనియర్‌ డీవీగా (డీవీ మనుమడు) పేరొందిన దుబ్బు వెంకట సుబ్బారావు తన రెండు దశాబ్దాల నట ప్రస్థానంలోదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులను అలరించారు.

వేటపాలెం మండలం ఆణుమల్లిపేటకు చెందిన డీవీ సుబ్బారావు(సీనియర్‌) పాడిన హరిశ్చంద్ర పద్యాలు, పాటలు అప్పట్లోనే గ్రామ్‌ఫోన్‌ రికార్డులుగా వచ్చాయి. 1970 దశకంలో అభిమానులు ఆయన చేతికి స్వర్ణ కంకణం తొడిగారు. ఆంధ్రా తాన్‌సేన్, కలియుగ హరిశ్చంద్ర, మధురగాన విశారద బిరుదులు, సన్మానాలు పొందారు సీనియర్‌ డీవీ. ఆయన మరణానంతరం అదే బాటలో కుమారుడు సుబ్బయ్య సత్యహరిశ్చంద్ర పాత్రను పోషించి మెప్పించారు. సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(జూనియర్‌) తన పదకొండో ఏటనే తాతను స్ఫూర్తిగా తీసుకుని రంగస్థలంపై వేషం వేశారు. వేలాది ప్రదర్శనలతో కళాభిమానులను అలరిస్తూ.. కళాకారులు, పెద్దలతో ప్రశంసలు అందుకుంటున్నారు. డీవీ సుబ్బారావు(జూనియర్‌) దాదాపుగా పదిహేడేళ్లుగా సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా నటిస్తున్నారు. ఇంత వరకు 5 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అర్జునుడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలతోపాటు చింతామణిలో భవానిగా నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతోపాటు బరంపురం, విజయవాడ, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లోనూ నాటకాలు వేశారు.

పలువురి ప్రశంసలు   
ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాదు, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్, సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, దివంగత మంగళంపల్లి బాలమురళీకష్ణ ఇంకా ఎందరో రాజకీయ నాయకులు, పెద్దల నుంచి జూనియర్‌ డీవీ ప్రశంసలు అందుకున్నారు. సినీ గాయకులు మనో జూనియర్‌ డీవీ, తండ్రి సుబ్బయ్యలతో కలిసి పలుమార్లు పద్యాలు పాడటం విశేషం. జూనియర్‌ డీవీ తన విశేష నటనా ప్రతిభకు గుర్తింపుగా బాల గంధర్వ నాటక కళానిధి, యువ నాటక గాన సుధానిధి బిరుదులు పొందారు. ఫిరంగిపురం, జంగారెడ్డిగూడెం, ఏటుకూరు ప్రాంతాల్లో హరిశ్చంద్ర నాటకంలో ఆయన నటనకు ముగ్ధులైన కళాభిమానులు సువర్ణ కంకణాలు బహూకరించారు. తాతపై తనకున్న అపార ప్రేమకు చిహ్నంగా వేటపాలెం మండలం రామన్నపేటలోని తన నివాసంలో ఇటీవల సీనియర్‌ డీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటించాలని తనకున్నా చూసేవారు కరువవుతున్నారని జూనియర్‌ డీవీ ఆవేదన వెలిబుచ్చారు. వెండితెర, బుల్లితెర ప్రభావంతో నాటకాల ప్రాభవం తగ్గిందని, ప్రభుత్వం నాటకరంగాన్ని, కళామతల్లిని నమ్మకున్న రంగస్థల నటులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

వేటపాలెం: తొలిజాము నుంచి సంధ్యవేళ వరకు పంట చేలో పనిచేసి అలసిన అన్నదాతలకు.. కుల వృత్తులు, కుటీర పరిశ్రమల్లో చెమటోడ్చిన దేహాలకు.. సాంత్వన చేకూర్చేందుకు, కాలక్షేపానికి దివ్యౌషధం నాటకం. పదిహేనేళ్ల క్రితం వరకు రంగస్థలం, రంగస్థల కళాకారుల క్రేజ్‌ మాటల్లో వర్ణించలేం! అలాంటి కళాకారుల్లో డీవీ సుబ్బారావు(సీనియర్‌) ముందు వరుసలో ఉంటారు. ఆయన తనయుడు డీవీ సుబ్బయ్య, సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(డీవీ సుబ్బారావు) తమ గాత్రంతో పద్యాలాపన చేసి ప్రేక్షకలోకాన్ని మెప్పించారు. డీవీ కుటుంబంలో మూడు తరాలు రంగ స్థలంపై చెరగని ముద్ర వేశారు.     

మరిన్ని వార్తలు