హర్షవర్థన్‌@రూ. 35లక్షలు

11 Nov, 2018 07:33 IST|Sakshi

భారీ వేతనంతో గూగుల్‌లో ఉద్యోగం  

శ్రీకాకుళం అర్బన్‌: ప్రతిష్టాత్మక గూగుల్‌ కంపెనీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో శ్రీకాకుళానికి చెందిన పొన్నాడ హర్షవర్ధన్‌ ఎంపికయ్యాడు. గూగుల్‌ ఎంపికచేసిన షార్ట్‌లిస్ట్‌లో ఆసియాలోనే 36వ ర్యాంకు దక్కించుకున్న హర్షవర్ధన్‌ బెంగళూరులోని 12వారాల గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌లో అత్యద్భుతమైన ప్రావీణ్యతను సాధించడంతో తుది లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. దీంతో ఆ సంస్థ ఏడాదికి రూ.35లక్షల జీతం చెల్లింపునకు అంగీకరించి ఉద్యోగానికి ఎంపికచేసింది. 

సరస్వతీ పుత్రునిగా రాణింపు..
జిల్లాలోని పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన పొన్నాడ హర్షవర్ధన్‌ చిన్ననాటి నుంచే సరస్వతీ పుత్రునిగా రాణిస్తూ వస్తున్నాడు. తండ్రి పొన్నాడ వెంకటరమణ, అడ్వకేట్‌గా, పూర్వపు జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా సేవలందించారు. తల్లి అమ్మాజీ గృహిణి. ప్రస్తుతం వీరు శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. టెన్త్‌క్లాస్‌లో హైదరాబాద్‌ శ్రీచైతన్య స్కూల్‌లో 9.7గ్రేడ్‌ పాయింట్లు, ఇంటర్మీడియెట్‌లో 967 మార్కులు మార్కులు సాధించాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌లో 226ఓబీసీ, 1842 ర్యాంకు సాధించగా, మెయిన్స్‌లో ఏఐఆర్‌ 1345 ర్యాంకు దక్కించుకున్నాడు.

ఎంసెట్‌ ఓపెన్‌లో 448 మెరుగైన ర్యాంకు సొంతం చేసుకున్నాడు. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)లో, అలాగే బెంగళూరులోనే ఇండియన్‌ స్టాటికల్‌ ఇనిస్టిట్యూట్‌(ఐఎస్‌ఐ)లో ప్రవేశం పొంది కోర్సులను పూర్తిచేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మక కెవీపీవై స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యాడు. తాజాగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న గూగుల్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. తమ కుమారుడు హర్షవర్ధన్‌ ప్రతిభపై తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు