ఎన్‌ఐఏ విచారణ.. పత్తా లేకుండా పోయిన హర్షవర్ధన్‌

18 Jan, 2019 10:18 IST|Sakshi

సర్కారు పెద్దల అండతోనే పత్తా లేని హర్షవర్ధన్‌ చౌదరి?

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు, విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి ఎన్‌ఐఏ విచారణకు గైర్హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా విశాఖలోని కైలాసగిరి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు 3 రోజులుగా సాక్షులను విచారిస్తున్నారు. హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్‌ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపగా.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్‌ 2 రోజులక్రితం హాజరయ్యారు.

నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్‌సీపీ నేతలు సైతం 2 రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి మాత్రం పత్తా లేకుండా పోయారు. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఐఏ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపినట్టు సమాచారం. గురువారం ఆయన  హాజరుకావొచ్చని భావించారు. నిజానికి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్‌ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపించినా.. పోలీసులు, సిట్‌ అధికారులు హర్షవర్ధన్‌ జోలికే పోలేదు.

ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏవిచారణకు హర్షవర్ధన్‌ చౌదరి హాజరైతే కీలక సమాచారం రాబట్టవచ్చన్న వాదనలు వినిపించాయి. దీంతో గురువారమే హర్షవర్ధన్‌ విచారణకు హాజరు కావొచ్చన్న ప్రచారంతో పెద్దఎత్తున మీడియా ఎన్‌ఐఏ తాత్కాలిక కార్యాలయం వద్ద గుమిగూడింది. అయితే హర్షవర్ధన్‌ సహా రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ హాజరుకాలేదు. పైగా హర్షవర్ధన్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతోపాటు కొద్దిరోజులుగా పత్తా లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి యనమల నగరానికి వచ్చినప్పుడు హల్‌చల్‌ చేశాడని, ఆ తర్వాత నుంచి కానరావట్లేదని టీడీపీ నేతలే చెప్పుకొస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండతోనే హర్షవర్ధన్‌ పత్తా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఎన్‌ఐఏ వర్గాలు మాట్లాడుతూ.. ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్‌ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా