ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

1 Jul, 2015 03:12 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

టీడీపీ అవినీతి విధానాలను నిరసిస్తూ... ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైఎస్సార్‌సీపీ బాయ్‌కాట్
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. 35 మంది ఎంపీటీసీ సభ్యులను ప్రలోభపెట్టి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి క్యాంపు పెడితే రిటర్నింగ్ అధికారి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, గవర్నర్‌ను కూడా కలసి విన్నవించాం. న్యాయం మాత్రం జరగలేదు. ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా అవినీతి సొమ్ముతో ప్రజాప్రతినిధులను కొని గెలవాలనుకుంటోంది. అందుకే ఈ అవినీతిని నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించాం..’ అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎమ్మెల్సీ అభ్యర్థి అట్ల చినవెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రలోభపెట్టి, డబ్బులిచ్చి తమను ఇక్కడకు బలవంతంగా తీసుకువచ్చారని, తమను పంపిస్తే వెళ్లిపోతామని మీడియా సాక్షిగా తమ ఎంపీటీసీ సభ్యులు చెప్పినా పోలీసుల సాయంతో రాష్ట్రం దాటించారన్నారు. ప్రచారానికి గడువు ఒక్కరోజే ఉన్న తరుణంలో కూడా తమ సభ్యులు 35 మంది జాడ తెలియటంలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు