ఎర్రబారి గోదారమ్మా.. వెల్లువెత్తి సాగేనమ్మా

21 Jun, 2015 03:59 IST|Sakshi

ధవళేశ్వరం/ఆత్రేయపురం : పుష్కరాలు రానున్న నేపథ్యంలో.. పుట్టిళ్లలాంటి కొండకోనల నుంచి గోదారమ్మకు పసుపు‘కుంకుమ’లతో సారె అందినట్టుంది. ఆ కుంకుమను ఒళ్లంతా పూసుకున్నట్టు అప్పుడే నది కొత్తనీటితో ఎరుపెక్కింది.  ఇటీవల ఎన్నడూ లేనట్టు.. జూన్‌లోనే గోదావరి ప్రవాహం ఉధృతమైంది. సాధారణంగా జూలై నెల నుంచి గోదావరికి వరదలు వస్తాయి. 1992 తర్వాత ఈ ఏడాదే జూన్‌లో గోదావరికి వరదలు వచ్చాయని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉపనదుల నుంచి, వాగువంకల నుంచి గోదావరికి వచ్చే చేరే నీరు పెరుగుతోంది. శబరి పరవళ్లు తొక్కుతూ వచ్చి గోదావరిలో కలుస్తోంది.
 
 ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి శనివారం సాయంత్రం 2,47,410 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లకు 137 గేట్లను రెండు మీటర్ల మేర పైకి లేపారు. ఎగువన భద్రాచలంలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. అక్కడ శుక్రవారం 14.10 అడుగులున్న నీటి మట్టం శనివారం సాయంత్రానికి 24.7 అడుగులకు చేరింది. ఆదివారం నాటికి ధవళేశ్వరం వద్ద మిగులు జలాలు నాలుగు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు పడుతుండటంలో తూర్పు డెల్టాకు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు.
 
  సెంట్రల్ డెల్టాకు 150, పశ్చిమ డెల్టాకు 200 క్యూసెక్కులు విడుదల చేశారు. శనివారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 7.80 అడుగులకు  చేరింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఫ్లడ్ కన్జర్వేటర్ పి.వి.తిరుపతిరావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 3.35 మీటర్లు, కూనవరంలో 10.15 మీటర్లు, పేరూరులో 6.35 మీటర్లు, దుమ్ముగూడెంలో 7.26 మీటర్లు, కుంటలో 12.28 మీటర్లు, కొయిదాలో 13.12 మీటర్లు,పోలవరంలో 8.37 మీటర్లు, రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్ వద్ద 13.70 మీటర్ల వద్ద నీటి మట్టాలు నమోదయ్యూయి.
 
 ఘాట్ల పనులకు ఆటంకం
 కాగా బ్యారేజ్ దిగువన గౌతమి, వశిష్ట పాయల వెంబడి పలు గ్రామాల్లో జరుగుతున్న పుష్కరఘాట్ల నిర్మాణానికి.. ప్రవాహ ఉధృతి ఆటంకంగా మారింది. పనులు ఆలస్యంగా చేపట్టడం, దానికి తోడు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్కడి పనులు అక్కడే అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు