పాపిష్టి పనులు చేస్తే నమాజు వృథా

11 Dec, 2018 03:19 IST|Sakshi
ఇస్తెమాలో ప్రసంగిస్తున్న హజ్రత్‌జీ

ఇస్తెమా ముగింపు రోజున ముస్లింలకు హజ్రత్‌జీ హితబోధ

దువాకు 40 లక్షల మంది హాజరు

కర్నూలు (ఓల్డ్‌సిటీ):  పాపిష్టి సొమ్ముతో సిద్ధం చేసిన ఆహారాన్ని ఒక్కసారి ఆరగించినా 40 రోజుల నమాజు వృథాగా పోతుందని తబ్లీగ్‌ జమాత్‌ ప్రముఖుడు హజ్రత్‌జీ సాద్‌ సాహబ్‌ ముస్లింలకు హితబోధ చేశారు.  కర్నూలు నగర శివారు నన్నూరు టోల్‌గేట్‌  వద్ద 1,250 ఎకరాల్లో ఈనెల 7న జుమ్మానమాజుతో ప్రారంభమైన అంతర్జాతీయ ఇస్తెమా సోమవారం హజ్రత్‌జీ ప్రసంగం, దువాతో ముగిసింది. చివరి రోజున జనంతో ఇస్తెమా మైదానం పట్టలేదు. ఇస్తెమాకు సుమారు 40 లక్షల మంది హాజరై ఉంటారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ సందర్భంగా హజ్రత్‌జీ మాట్లాడుతూ విద్య లేని వారు అంధులతో సమానమని, అందరూ విద్యను తప్పకుండా నేర్చుకోవాలని, ఖురాన్‌ను ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండాలని సూచించారు. మసీదుల్లో నమాజు చేయించడం ఒక్కటే కాకుండా  ఇమామ్‌లు ఖురాన్‌ నేర్పడం కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం సర్వమానవాళి శ్రేయస్సు కోరుతూ దువా చేశారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన హజ్రత్‌జీ ప్రసంగం మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దువాతో ఇస్తెమా ముగిసింది.
ప్రణాళిక ప్రకారం నిష్క్రమణ..
నలభై లక్షల మంది ఒకేసారి రోడ్డు మీదికి రావడం కష్టసాధ్యం కావడంతో మొదటి అరగంట వరకు పాదచారులను, రెండో అరగంటలో ద్విచక్ర వాహనా లను, ఆ తర్వాత అరగంటకు నాలుగు చక్రాల వాహ నాలను, అటు తర్వాత భారీ వాహనాలను పంపిం చారు. ట్రాఫిక్‌ నియంత్రణ దృష్ట్యా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా వలంటీర్లు పోలీసులకు సహకరించారు.  ఇస్తెమాలో డిప్యూటీ సీఎంలు కె.ఇ.కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు ఎన్‌.ఎం.డి.ఫరూక్, కాలవ శ్రీనివాసులు, అఖిలప్రియ, ఎమ్మెల్సీ షరీఫ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఇస్తెమా సందర్భంగా ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్‌: తబ్లీగ్‌ ఏ జమాత్‌ ఆధ్వర్యంలో కర్నూలులో జరిగిన అంతర్జాతీయ ఇస్తెమాకు హాజరైన ముస్లిం సోదరులకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘అంతర్జాతీయ ఇస్తెమా కార్యక్ర మాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు నా హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేస్తున్నాను. ఎల్లవేళలా మన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అల్లాహ్‌ దయ ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు