ఐటీ శాఖ మంత్రిని కలిసిన హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు

12 Nov, 2019 21:47 IST|Sakshi

హెచ్ సీఎల్ కంపెనీ ద్వారా 'స్థానిక యువత'కు ఉపాధి అవకాశాలు, 

వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసే ప్రత్యేక కొత్త పాలసీ తెస్తాం

ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్, తయారీకి ఏపీ ప్రభుత్వం సహకారం

సాక్షి, అమరావతి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. నైపుణ్య శిక్షణ గురించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఎల్  క్యాంపస్‌ని సందర్శించాలంటూ సంస్థ ప్రతినిధులు మంత్రి గౌతమ్ రెడ్డికి  ఆహ్వానం పలికారు.

హెచ్‌సీఎల్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా  స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ అందించాలన్న మంత్రి ప్రతిపాదనకు  ప్రతినిధులు అంగీకారం తెలిపారు. వచ్చే జనవరి నుంచి హెచ్‌సీఎల్  ప్రారంభించనున్న శిక్షణాపరమైన కార్యక్రమాలను సందర్శించాలని  హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ మంత్రిని కోరారు. యువతకు శిక్షణ అందించేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని మంత్రి కోరారు. అందుకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. చర్చలో భాగంగా, నైపుణ్య రంగంలో శిక్షణాపరమైన అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. తనతో జరిగిన భేటీలోని చర్చ సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రవిశంకర్ పాల్గొన్నారు.

వస్త్ర పరిశ్రమలో యంత్రాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన మంత్రి

గుంటూరు : మంగళగిరిలో నిర్వహించిన '23వ ప్రాడక్ట్ కమ్ కాటలాగ్ షో' కార్యక్రమానికి  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   వస్త్ర పరిశ్రమలో వివిధ రాష్ట్రాల్లో  వినియోగించే వినూత్న యంత్రాల ప్రదర్శనను మంత్రి తిలకించారు.ఇండియన్ టెక్స్‌టైల్‌ యాక్ససరీస్‌, యంత్రాల తయారీ సంఘం' (ఐటీఏఎమ్‌ఎమ్‌ఏ) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం  హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో  నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ మార్కెట్ లో వస్త్ర  పరిశ్రమలు  అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను పెంచే  విధంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నామని మంత్రి మేకపాటి  వెల్లడించారు. అధునాతన యంత్రాల వినియోగంతో ఉత్పత్తి చేసే విషయంలో భారతదేశం అగ్రశ్రేణి దేశాలలో ముందుందని అన్నారు.

4.5 కోట్ల మంది ప్రత్యక్ష్యంగా ఉపాధి పొందుతున్న వస్త్ర పరిశ్రమ అభివృద్ధి ఎంతో కీలకమన్నారు. ప్రపంచంలోనే వస్త్ర ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు. ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పత్తి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలోఉందన్నారు. వస్త్రాలను నాణ్యమైన రీతిలో ఆకర్షణగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యం ప్రత్యేకంగా కొనియాడదగినదన్నారు. నాణ్యమైన  వస్త్ర ఉత్పత్తి, సాంకేతిక పద్ధతుల ద్వారా కృషి చేస్తే వస్త్ర పరిశ్రమ మరింతగా విస్తరించే అవకాశముందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్, మహారాష్ట్రకు చెందిన వస్త్ర పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో  వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వస్త్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు