వచ్చే ఏడాది జూన్‌ కల్లా హెచ్‌సీఎల్‌ ప్రారంభం

13 May, 2017 01:57 IST|Sakshi
వచ్చే ఏడాది జూన్‌ కల్లా హెచ్‌సీఎల్‌ ప్రారంభం

- ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడి
- నోయిడాలో హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ శివ నాడార్‌తో భేటీ


సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలో వచ్చే ఏడాది జూన్‌ కల్లా హెచ్‌సీఎల్‌ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. శుక్రవారం నోయిడాలో హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ శివ నాడార్‌తో సమావేశమై.. విజయవాడ, అమరావతిలో సంస్థ ఏర్పాటుకు హెచ్‌సీఎల్‌తో మార్చి 30న కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు చెందిన పత్రాలను లోకేశ్‌ అందజేశారు. అనంతరం హెచ్‌సీఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పవన్‌ ధన్వార్‌తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ..  రూ. 500 కోట్ల పెట్టుబడులతో ఐటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, జీపీవో పరిశ్రమలను హెచ్‌సీఎల్‌ ఏర్పాటు చేయనుందని తెలిపారు.

అమరావతితో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నామని, వచ్చే ఏడాది జూన్‌లో మొదటి విడత కార్యాలయాన్ని ప్రారంభిస్తామని స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తామని పవన్‌ ధన్వార్‌ తెలిపారు. కాగా హెచ్‌సీఎల్‌ సంస్థ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరవల్లిలో 17.86 ఎకరాల్లో మొదటి కేంద్రాన్ని ప్రారంభించనుందని, రెండో కేంద్రాన్ని ఐనవోలు గ్రామంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వార్తలు