శభాష్ అనేలా...

19 Jan, 2014 03:31 IST|Sakshi
మేడారం (తాడ్వాయి), న్యూస్‌లై న్ :కోటి మందికి పైగా భక్తులు వచ్చే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర విజయవంతానికి పోలీస్ అధికారులు, సిబ్బంది కృషిచేయూలని, ప్రజల చేత శభాష్ అనిపించుకునేలా సేవలందించాలని డీజీపీ ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఐజీ రవిగుప్తా, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, వరంగల్ రూరల్, ఖమ్మం ఎస్పీలు కాళిదాసు, రంగనాథ్, ఓఎస్‌డీ అంబర్ కిషోర్ ఝాతో కలిసి శనివారం ఆయన వనదేవతలను దర్శించుకున్నారు. ఈ మేరకు పూజారులు వారికి గిరిజన సంప్రదాయూల ప్రకారం డోలి వాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు డీజీపీ ఐటీడీఏ అతిథి గృ హంలో పోలీస్ అధికారులతో సమావేశమై జాతరలో పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
 
 కాజీపేట నుంచి మేడారం... జంగాలపల్లి నుంచి భూపాలపల్లి... పస్రా నుంచి మేడారం వరకు చేపట్టనున్న ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఆయనకు అధికారులు వివరించారు. ఆ రూట్లలో వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద... ఆర్టీసీ బస్టాండ్ ప్రాంత్లాలో భక్తుల రద్దీపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ మేరకు తగు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత డీజీపీ ప్రసాదరావు మాట్లాడుతూ గత అనుభవాలను  దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
 జాతరకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివే సేలా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయూలని, జాతరకు ముందు నుంచే మేడారంలో పోలీస్ బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చివెళ్లే భక్తుల వాహనాల మళ్లింపులో ప్రధానంగా దృష్టి సారించాలని, ట్రాఫిక్ జాం కాకుండా చూడాలన్నారు. దేవతల గద్దెలపైకి కన్నెపల్లి నుంచి సారలమ్మను, చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో పూజారులకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తూ శాంతియుతంగా పనిచేయాలన్నారు. గత జాతరలో పనిచేసిన అనుభవం గల అధికారులను నియమించనున్నట్లు వెల్లడించారు.
 
 విద్యాకేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ
 రూరల్ ఎస్పీ కాళిదాసు ఆధ్వర్యంలో మేడారంలో ఏర్పాటు చేసిన విద్యాకేంద్రాన్ని డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. గిరిజన నిరుద్యోగులకు విద్య, ఉపాధి కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయనకు కాళిదాసు వివరించారు. మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు కుర్సం రవి... డీజీపీతో మాట్లాడారు. పోలీస్ ఉద్యోగాల కోసం గిరిజన యువకులకు మేడారంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన డీజీపీ మేడారంలో ఈ మేరకు శిక్షణ ఇచ్చేలా రిటైర్డ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. ఇటీవల మేడారంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు యువకుల నుంచి మంచి స్పందన వచ్చిందని  డీజీపీకి ఓఎస్‌డీ అంబర్‌కిషోర్ జా వివరించారు.  కార్యక్రమంలో ములుగు డీఎస్పీ మురళీధర్, ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్, సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, తాడ్వాయి ఎస్సై హతీరాం ఉన్నారు. 
 
 
మరిన్ని వార్తలు