గుంటూరు చానల్‌కు గండి

24 Mar, 2016 01:41 IST|Sakshi
గుంటూరు చానల్‌కు గండి

నంబూరులో వంతెన నిర్మాణ పనుల వద్ద ఘటన  
గుంటూరు నగరానికి నెల రోజులు సరిపడా నీరు మురుగు చెరువుపాలు..

 
నంబూరు (పెదకాకాని) : నంబూరు వద్ద గుంటూరు చానల్ (కాలువ)కు గండి పడింది. మంగళవారం రాత్రంతా కృష్ణా నది నుంచి చానల్‌కు వచ్చిన నీరు గ్రామంలోకి చేరి మురుగు చెరువు పాలయ్యాయి. నంబూరు గ్రామంలోకి వెళ్లేందుకు గుంటూరు చానల్‌పై నిర్మించిన వంతెన దాటాల్సి ఉంటుంది. ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వంతెన నిర్మాణం, రోడ్డు విస్తరణకు రూ.2 కోట్లు ఆర్‌డీఎస్ నిధులు మంజూరయ్యాయి.

వాటిలో సుమారు రూ.76 లక్షలతో 24 రోజుల క్రితం కాంట్రాక్టర్ వంతెన నిర్మాణం పనులు ప్రారంభించారు.  సుమారు 20 వేల మంది జనాభా ఉన్న గ్రామంలో వంతెన నిర్మించేటప్పుడు ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ మొదట్లో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయకుండానే పనులు చేపట్టారు. ఈ విషయం వివాదంగా మారడంతో అస్తవ్యస్తంగా తాత్కాలిక రోడ్డు నిర్మించారు. ప్రజలు ఈ పనులపై ప్రశ్నించిన ప్రతిసారీ పోలీసులను రప్పించి వెళ్లగొట్టడం, ఎవరైనా పనుల తీరుపై మాట్లాడితే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

నీటి ప్రవాహంతో విద్యుత్ స్తంభం, కేబుల్ వైర్లు, పైపులైన్లకు దెబ్బ..  
గుంటూరు చానల్‌పై వంతెన నిర్మాణం పనులతో కాలువ నీటిని పక్కకు మళ్లించారు. నాశిరకం పనులతో నీరు మళ్లించిన కాలువ కట్టకు గండి పడి నీరు గ్రామంలోని చెరువుకు చేరింది. కాలువ కట్ట కోతకు గురికావడంతో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. బీఎస్‌ఎన్‌ఎల్ కేబుల్ వైర్లు, పైపులైన్ దెబ్బతిన్నాయి. కాలువకు గండి పడటం వల్ల గ్రామంలోని చెరువులో సుమారు రూ.18 లక్షల విలువైన చేపలు చెల్లాచెదురయ్యాయని చేపల పెంపకందారుడు బట్టు శివరామకృష్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు