వైద్యం.. ‘ప్రైవేట్‌’కు నైవేద్యం! 

13 Jun, 2018 03:24 IST|Sakshi

నాలుగేళ్లలో కోట్లకు కోట్లు ప్రైవేటుకు ధారాదత్తం 

అంపశయ్యపై ఆరోగ్యశ్రీ పథకం 

హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ సేవలకు మంగళం 

108, 104 వాహనాలు ఎప్పుడొస్తాయో తెలీదు 

25వేల ఖాళీలున్నా నాలుగేళ్లలో ఒక్క నియామకమూ లేదు 

వైద్యుల కొరతతో రోగులకు నరకం 

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారం ‘ప్రైవేట్‌’కు దాసోహం అన్నట్లుగా ఉంటోంది. గత నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయల విలువ చేసే సేవలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేశారు. సర్కారు తీరుతో కార్పొరేట్‌ కంపెనీలకు ‘కోట్ల’ వర్షం కురుస్తుంటే పేదల రోగుల పరిస్థితి మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోంది. ఫలితంగా.. ప్రమాదకర జబ్బు దాపురిస్తే ఆరోగ్యశ్రీలో వైద్యమందుతుందో లేదో తెలియని పరిస్థితి. ఆపదలో 108కు ఫోన్‌చేస్తే వచ్చే వరకూ నమ్మకంలేదు.. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ నెలవారీ మందులు తీసుకుందామని ఎదురుచూసే వృద్ధులకు 104 వాహనం దైవాధీనం. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ మంత్రం జపిస్తుండడంతో ఆస్పత్రుల్లో వేలాది ఖాళీలున్నా పట్టించుకునే దిక్కులేదు. మెడికల్, పారా మెడికల్, నర్సింగ్, ఏఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసిన లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధిలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ డాక్టరు ఉంటాడో లేదోననే అపనమ్మకంలో రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేద రోగికి భరోసా ఇచ్చిన పథకాలన్నీ వ్యయ భారం పేరుతో మిణుకు మిణుకుమంటున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రైవేటు కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని అధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.    
–సాక్షి, అమరావతి 

ఆరోగ్య శాఖపై మాయని మచ్చ 
ఇప్పటివరకూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఒక పెద్దాసుపత్రిలో అది కూడా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న శిశువు.. ఎలుకలు కొరికిన కారణంగా మృత్యువాత పడిన ఘటన చవిచూడలేదు.  గుంటూరు పెద్దాసుపత్రిలో ఈ విషాదం జరిగింది. రాష్ట్రంలో ఆస్పత్రుల దుస్థితి ఎలా ఉందో యావత్‌ దేశానికి ఈ దుర్ఘటన చాటిచెప్పింది. సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి.. సర్కారు నిర్లక్ష్యం ఇందుకు కారణాలు. 

అంపశయ్యపై ఆరోగ్యశ్రీ 
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు అంపశయ్యపై మూలుగుతోంది. జాబితాలో మొత్తం 934 జబ్బులకు గాను టీడీపీ హయాంలో 133 జబ్బులను తొలగించారు. హైదరాబాద్‌లో వైద్యాన్నీ నిరాకరిస్తున్నారు. దీంతో కిడ్నీ, తలసేమియా బాధితుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యశ్రీ పథకం ఖర్చుతో కూడుకున్నదన్న భావనతో దానిని రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారు. 

108, 104ల రాక దేవుడికెరుక 
అలాగే, రాష్ట్రంలో 2014 తర్వాత 108, 104 వాహనాల సేవలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. నిధులు కేటాయించకపోవడంతో 108లు అవసాన దశకు చేరాయి. మరమ్మతులకు, డీజిల్‌కూ డబ్బుల్లేవని ఆగిపోయిన సందర్భాలు అనేకం. వేతనాలు సకాలంలో ఇవ్వడంలేదని ఉద్యోగులు రోడ్డెక్కారు కూడా. ఇక పల్లెలకు వెళ్లాల్సిన 104 వాహనాలు ఎప్పుడెళ్తాయో, మందులెప్పుడిస్తాయో దేవుడికే ఎరుక. ఇదిలా ఉంటే.. ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న 1604 మంది ఆరోగ్యమిత్రలను తొలగించారు. చివరకు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి కొనసాగుతున్నారు. అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా   450 హోమియో డిస్పెన్సరీలను మూసేయగా, అందులో 950 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. తాజాగా 102 కాల్‌సెంటర్లలో పనిచేస్తున్న 28 మంది మహిళా ఉద్యోగులు రోడ్డున పడ్డారు.  

ఒక్క ఉద్యోగ నియామకమూ లేదు 
రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లో వైద్యులు లేక రోగులు విలవిల్లాడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ హోదాల్లో 25వేలకు పైగా ఖాళీలున్నట్టు అంచనా. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నియామకాన్ని కూడా చేపట్టలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో వైద్యుల్లేక పల్లెల్లోని ప్రజానీకం నానాయాతన పడుతున్నారు. మరోవైపు.. స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు ఇలా పలు విభాగాల్లో వేలాది ఖాళీలు ఉన్నా పట్టించుకోవడంలేదు. 

కార్పొరేట్‌ సేవలో.. 
రాష్ట్రంలో ఇప్పటివరకూ సుమారు 26 రకాల సేవలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పారు. ఆయా సంస్థలకు కోట్లాది రూపాయలు ధారాదత్తం చేశారు. రక్తపరీక్షల నుంచి ఎక్స్‌రేల వరకూ అన్నీ ప్రైవేటు సంస్థలకే. ఇక 104, 102 వంటివన్నీ కార్పొరేట్‌ సంస్థలకే ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిని కూడా ప్రైవేటుకు అప్పజెప్పారు. విశాఖలోని విమ్స్‌ను ప్రైవేటుపరం చేసేందుకు కసరత్తు దాదాపు పూర్తయింది. అలాగే, గడిచిన నాలుగేళ్లలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన పనులన్నీ కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చారు. ఈ బాగోతంలో కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 

డయాలసిస్, హెచ్‌ఐవీ బాధితులకు మొండిచేయి 
డయాలసిస్‌ చేయించుకునే బాధితులకు నెలకు రూ.2,500లు చొప్పున పెన్షన్‌ ఇస్తామని సర్కారు హామీ ఇచ్చింది. హెచ్‌ఐవీ బాధితులకు కూడా నెలకు రూ.వెయ్యి పెన్షన్‌ ఇస్తామన్నారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20వేల మంది డయాలసిస్‌ బాధితులుంటే 2వేల మందికే ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి ఇవ్వడంలేదు. అంతేకాక, సుమారు 70వేల మంది హెచ్‌ఐవీ బాధితులు నాలుగేళ్లుగా పెన్షన్‌ కోసం నిరీక్షిస్తున్నారు. 

మరిన్ని వార్తలు