ఆరోగ్యశాఖ గణాంకాధికారి ఆస్పత్రిపాలు

28 Sep, 2014 02:25 IST|Sakshi
ఆరోగ్యశాఖ గణాంకాధికారి ఆస్పత్రిపాలు

అనంతపురం మెడికల్:
 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ గణాంక అధికారి ఉమామహేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం బీపీ లెవల్స్ పూర్తిగా పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ఐసీయూలో చేర్చారు. డీఎంహెచ్‌ఓ దూషించినందువల్లే ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆస్పత్రి పాలైనట్లు   తెలిసింది. కొంతమేరకు కోలుకున్న ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు ఆయన మాటాల్లో.. ‘ ఈ నెల 25న  డీఎంహెచ్‌ఓ రామసుబ్బారావు నన్ను పిలిపించారు.  గ్రామాల్లో ఇళ్లలో అవుతున్న ప్రసవాల జాబితా అడిగారు. ఏడెనిమిది క్లస్టర్ల నుంచి అందిన సమచారాన్ని ఆయనకు ఇచ్చాను. మిగిలినవి రాలేదని తెలిపాను. పూర్తి సమాచారం ఎందుకు తెప్పించుకోలేదని ఆయన నాపై ఆగ్రహించారు. అందరికీ ఫోన్లు చేశాను, సమాచారం అందగానే తెలియచేస్తానని సమాధానమిచ్చా. దీంతో ఆయన నన్ను దూషిస్తూ మాట్లాడారు. మర్యాదగా మాట్లడమని కోరాను.. దీనిపై ఆయన రెచ్చిపోయి గెట్‌అవుట్  అంటూ తిట్టారు. మరుసటి రోజు(26న) ఉదయం కార్యాలయానికి వచ్చాను.  క్యాంప్‌నకు వెళ్లాలని డీఎంహెచ్‌ఓ ఉద్దేశపూర్వకంగా ఆదేశించారు. కార్యాలయంలో మీటింగ్ జరుగుతోందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న నేను అప్పటికే మానసిక వత్తిడికి గురయ్యాను. క్యాంపునకు వెళ్లి రాత్రి వచ్చే సరికి నీరసించి అస్వస్థతకు గురయ్యాను. శనివారం ఉదయం లేవలేకపోవడంతో మా క్వార్టర్స్‌లో ఉన్న డాక్టర్ నా పరిస్థితి గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు.’ డీఎంహెచ్‌ఓ వేధింపులవల్ల తాను అస్వస్థతకు గురయ్యానని ఎస్‌ఓ ఆవేదన వ్యక్తం చేశారు.
  ఎమ్మార్పీఎస్ నాయకుల పరామర్శ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఓ ఉమామహేశ్వరరావును ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్, నాయకులు  పెద్ద ఓబుళేసు, ఎన్‌ఎన్‌కుంట సూరి, దొడ్డప్ప, తదితరులు పరామర్శించారు.  బీసీఆర్ దాస్ మాట్లాడుతూ డీఎంహెచ్‌ఓ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని   ఆరోపించారు. ఎస్సీ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడుతున్నారని బాధితులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు.  డీఎంహెచ్‌ఓపై చర్యల తీసుకోవాలని ఆందోళనలు చేయడంతోపాటు,  మంత్రులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వెంటనే డీఎంహెచ్‌ఓపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.



 

మరిన్ని వార్తలు