ఆరోగ్య కేంద్రాలకు సుస్తీ

29 Apr, 2019 12:25 IST|Sakshi
వైద్యం కోసం వేచి ఉన్న ప్రజలు

బడ్జెట్‌ ఎక్కువ.. సర్వీసు తక్కువ

మురికి వాడలకు అందని వైద్య సేవలు

గర్భిణులు, చిన్న పిల్లలకు ఇబ్బందులు

నామమాత్రంగా ఆరోగ్యకేంద్రాల సేవలు

నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలను గాలికొదిలేశారు. వీటిని గతంలో ఎన్జీఓలు నిర్వహించేవి. ప్రభుత్వం వీటి నిర్వహణకు నెలకు రూ. 67 వేలు చెల్లించేది. ఎక్కువ నిధులిచ్చినా ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. ప్రతి వారం పిల్లలకు టీకాలు వేసేవారు. గర్భిణుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేవారు. 2014లో టీడీపీ ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాల స్థానంలో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్జీఓలను తొలగించి ప్రవేట్‌ సంస్థకు ఆస్పత్రుల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. నెలకు రూ. 4.50 లక్షలు చెల్లిస్తున్నారు. అవసరమైన మందులు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇంత పెద్దమొత్తంలో బడ్జెట్‌ కేటాయించినా ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్‌ఎంలకు క్షేత్రస్థాయికి వెళ్లే బాధ్యతలను తొలగించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు మాత్రమే వైద్యం చేసి పంపిస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా , ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వం జిల్లాలో పదహారు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది కడపలో 5, ప్రొద్దుటూరులో 6, జమ్మలమడుగులో 2, రాజంపేట, రాయచోటి, బద్వేల్‌లో ఒకటి ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పర్యవేక్షణలో ఇవి నడవాల్సి ఉంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు వీటిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ప్రైవేట్‌ సంస్థలకు కాంట్రాక్ట్‌ అప్పగించినందున వైద్యఆరోగ్య శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచే నెలనెలా బడ్జెట్‌ విడుదల అవుతోంది. ఈ కారణంతో జిల్లా అధికారుల అజమాయిషీ లేదని తెలుస్తోంది. ఫలితంగా ఆరోగ్య కేంద్రాల నిర్వహణ ఇష్టానుసారంగా సాగుతోంది. అడిగేవారు లేకపోవడంతో ఎవరు వస్తున్నారో, ఎవరు రాలేదో తెలియని పరిస్థితి.

మురికి వాడలకు అందని వైద్య సేవలు..
పట్టణంలోని మురికివాడల్లో పేదలకు వైద్య సేవలు అందించాలని గతంలో  ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్జీఓ సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రాల్లోని ఏఎన్‌ఎంలు మురికి వాడలకు వెళ్లి ప్రజలకు వైద్యం అందించేవారు. 2104 నుంచి టీడీపీ హయాంలో నిబంధనలు మార్చారు. వీటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ  కేంద్రాల నుంచి మురికి వాడలకు వెళ్లే వారే కరువయ్యారు. సాధారణంగా మురికి వాడల్లో అక్షరాశ్యులు తక్కువగా ఉంటారు. అవగాహన లేకపోవడంతో వారం వారం టీకాలు వేయించుకోలేని వారు చాలా మంది ఉంటారు. పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లడానికి ఒక్కోసారి సమయం ఉండదు. పనిధ్యాసలో టీకాలు పిల్లలకు టీకాలు వేయించాలనే సంగతే గుర్తుండదు. ఇళ్ల వద్దకు వెళ్తేగాని టీకాలు వేయించుకోలేని పరిస్థితి. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లకపోవడంతో టీకాలు వేయించుకునే పిల్లల సంఖ్య బాగా తగ్గినట్లు కనిపిపిస్తోంది. ఏడాది క్రితం వరకు హెడ్‌ ఏఎన్‌ఎంలు పని చేసేవారు. బుధవారం, శనివారాలలో టీకాలు వేసే ఏఎన్‌ఎంలకు రోజుకు రూ. 500 చొప్పున చెల్లించేవారు. వీరు వారంలో రెండు రోజులు మురికి వాడలకు వెళ్లి టీకాలు వేసేవారు. బడ్జెట్‌ లేదనే రాలేదనే కారణంతో ఏడాది నుంచి వీరిని తొలగించారు.

టెలిమెడిషన్‌ ద్వారా రోగులకు మందులు
జ్వరం, కడపునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లాంటి చిన్న చిన్న జబ్బులకు డాక్టరే పరీక్షించి మందులు ఇస్తారు. ఇతర జబ్బులతో ఆస్పత్రికి వెళ్లిన వారికి టెలిమెడిసిన్, వీసీ మెడిసిన్‌ ద్వారా వైద్యం చేస్తారు. ఆన్‌లైన్‌లో డాక్టర్‌కు వీడియో ద్వారా ఇక్కడి డాక్టర్‌ చూపిస్తారు. ఏవైనా దెబ్బతగిలినా, దీర్ఘకాలిక గంతులు ఏవైనా ఉంటే వీడియో ద్వారా ఆన్‌లైన్‌లోని డాక్టర్‌కు చూపిస్తే మందులు సూచిస్తారు. ఈ తతంగం పూర్తి కావడానికి ఒక్కో పేషెంట్‌కు కనీసం 15–20 నిమిషాల సమయం పడుతుంది. సర్వర్‌ సమస్య కారణంగా ఒక్కో సారి గంటల తరబడి ఆస్పత్రిలోనే వేచి ఉండాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు. షుగర్, బీపీ పరీక్షల కోసం వచ్చిన వారి పేర్లను కూడా టెలిమెడిసిన్‌లో నమోదు చేసి, ఓపీ ఎక్కువగా చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. డాక్టర్‌ రాని రోజున ఆస్పత్రిలోని ల్యాబ్‌ టెక్నీషియన్, ఏఎన్‌ఎంలు కూడా టెలిమెడిసిన్‌ ద్వారా వైద్యం చేస్తారని రోగులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు