ఆరోగ్య రాజధానిగా విశాఖ

1 Jan, 2015 05:39 IST|Sakshi
  • మంత్రి కామినేని శ్రీనివాసరావు
  • మణిపాల్‌లో ఫీటల్ మెడిసిన్ ప్రారంభం
  • విశాఖ మెడికల్: విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగానే కాకుండా ఆరోగ్య రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు తెలిపారు. జగదాంబ జంక్షన్లోని మణిపాల్ తల్లి, పిల్లల ఆస్పత్రిలో బుధవారం ఫీటల్ మెడిసిన్, నవజాత నిశిత శిశు చికిత్సా(ఎన్‌ఐసీయూ) విభాగాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల వైద్య కేంద్రంగా విరాజిల్లుతోందని, భవిష్యత్‌లో మరిన్ని అధునాతన వైద్య సదుపాయాలను తీసుకురావడం ద్వారా దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

    ఒడిశా, చత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్ రాష్టాల సరిహద్దు జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు విశాఖ నగరానికి వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ వైద్య రంగంలో ప్రత్యేక వైద్య సదుపాయాలు నగరంలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. విశాఖలో తొలిసారిగా మణిపాల్ తల్లి,పిల్ల ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య విభాగమైన ఫీటల్ మెడిసిన్ ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. మణిపాల్ ఆస్పత్రి సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ అజయ్‌భక్షి మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా మణిపాల్ ఆస్పత్రి అధునాతన నవజాత శిశు ైవె ద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.

    2007లోనే నవజాత శిశు వైద్యంలో లెవల్-3 చికిత్స సదుపాయాలను మణిపాల్ ఆస్పత్రి నగరానికి పరిచయం చేసిందన్నారు.  విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఫీటల్ మెడిసిన్ చికిత్స పుస్తకాన్ని మంత్రితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆస్పత్రి ఫీటల్ మెడిసిన్ అధిపతి డాక్టర్ ఎం.మాధురి, నవజాత శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సునీల్‌కిషోర్, పిల్లల వైద్యురాలు డాక్టర్ అమితా త్రిపాఠి, జి.రాము, మణిపాల్ గ్రూప్ దక్షిణ భారత సీఓఓ గౌరవ్ రేఖి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు